gun misfire: స్టేషన్ లో గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి
- కొమురంభీం జిల్లాలోని కౌటాల పీఎస్ లో ఘటన
- సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ రజనీ కుమార్ కు గాయాలు
- తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
- హైదరాబాద్ లో చికిత్స పొందుతూ చనిపోయిన రజనీ కుమార్
కొమురంభీం జిల్లాలోని కౌటాల పోలీస్ స్టేషన్ లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ రజనీ కుమార్ స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి అని ఆయన సహోద్యోగులు చెప్పారు.
కౌటాల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ రజనీ కుమార్ మంగళవారం సెంట్రీ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో గన్ పేలిన శబ్దం వచ్చిందని స్టేషన్ లో ఉన్న సిబ్బంది తెలిపారు. బయటకు వచ్చి చూడగా సెంట్రీ రజనీ కుమార్ నేలమీద పడి ఉన్నాడని చెప్పారు. బుల్లెట్ తలలో నుంచి దూసుకుపోవడంతో రజనీ కుమార్ కుప్పకూలిపోయాడని వివరించారు.
రజనీని వెంటనే ఆసుపత్రికి తరలించి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని స్టేషన్ సిబ్బంది తెలిపారు. జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ కాగజ్ నగర్ లోని ఆసుపత్రికి వెళ్లి రజనీ కుమార్ పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 11:30 గంటల ప్రాంతంలో రజనీ కుమార్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రజనీ కుమార్ చేతుల్లోని ఎస్ఎల్ఆర్ గన్ పేలడం వల్లే బుల్లెట్ తలలోకి దూసుకెళ్లిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో విచారణ జరిపిస్తామని ఎస్పీ వెల్లడించారు.