suryakumar yadav: ఏ గ్రహం నుంచి వచ్చావు నాయనా?: సూర్యకుమార్ యాదవ్ పై వసీం అక్రమ్ కామెంట్
- ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న సూర్యకుమార్ యాదవ్
- వేరే గ్రహం నుంచి వచ్చాడనుకుంటున్నానన్న అక్రమ్
- ఏ మాత్రం భయం లేని క్రికెటర్ అని ప్రశంస
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ కీలక దశకు చేరుకుంది. రేపు, ఎల్లుండి సెమీ ఫైనల్స్ జరగనున్నాయి. రేపు న్యూజిలాండ్, పాకిస్థాన్... ఎల్లుండి ఇండియా, ఇంగ్లాండ్ సెమీస్ లో తలపడనున్నాయి. మరోవైపు టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్థి ఎవరన్నది తనకు అనవసరం అన్నట్టుగా విరుచుకుపడుతున్నాడు. సూర్య దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు డీలా పడుతున్నారు. నాలుగు ఇన్నింగ్స్ లలో మూడు అర్థ శతకాలను సాధించాడు. గత 5 ఇన్నింగ్స్ లలో 225 పరుగులను సాధించాడు. 193.96 స్ట్రైక్ రేట్ తో సూర్య ప్రభంజనం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ పై పాకిస్థాన్ బౌలింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించారు. అతను వేరే గ్రహం నుంచి వచ్చాడని తాను అనుకుంటున్నానని.. ఏ గ్రహం నుంచి వచ్చావు? అని అక్రమ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సూర్య చాలా డిఫరెంట్ అని అన్నారు. 2022లో టీ20లో వెయ్యి పరుగులను సాధించిన ఏకైక క్రికెటర్ సూర్య మాత్రమేనని చెప్పారు. ఒక జింబాబ్వే పైన మాత్రమే కాదు... ప్రపంచంలోని టాప్ బౌలింగ్ అటాక్స్ పై సూర్య ఆడిన ఆట ఒక ట్రీట్ అని కితాబునిచ్చారు. అతని టాలెంట్ అమోఘమని.. ఏ మాత్రం భయం లేని బ్యాట్స్ మెన్ అని అన్నారు. బంతి శరీరానికి తగిలినా లెక్కచేయని తత్వమని ప్రశంసించారు. సూర్య ఆటను వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.
పాకిస్థాన్ కు చెందిన మరో బౌలింగ్ దిగ్గజం వకార్ యూనిస్ మాట్లాడుతూ... సూర్యకు బౌలర్ ఎక్కడ బంతిని విసరాలని ప్రశ్నించారు. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో సూర్యకుమార్ యాదవ్ తొలి స్థానంలో ఉన్నాడు. రానున్న రెండు మ్యాచుల్లో సూర్య ఇదే ఆటతీరును కొనసాగిస్తే భారత్ టీ20 ప్రపంచకప్ ను కైవసం చేసుకోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.