Andhra Pradesh: జల్ జీవన్ మిషన్ లెక్కలనూ సీఎం జగన్ టాంపరింగ్ చేశారు: బీజేపీ నేత సత్యకుమార్

bjp leader y satya kumar alleges ap cm ys jagan tampering the jal jeevan mission details

  • జల్ జీవన్ మిషన్ అమలు ఏపీలో అధ్వానంగా ఉందన్న సత్యకుమార్
  • కేంద్రానికి జగన్ సర్కారు తప్పుడు లెక్కలు పంపిందని ఆరోపణ
  • 20 శాతం పనులు చేసి 100 శాతం చేసినట్టు చెప్పారని వెల్లడి

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల్ జీవన్ మిషన్ లో ఏపీ ఆశించిన ఫలితాలను సాధించడంలో ఘోరంగా విఫలమైనట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఆరోపించారు. ఏపీలో ఈ పథకం అమలు అధ్వానంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని వంద శాతం మేర అమలు చేశామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిందన్న సత్య కుమార్... వాస్తవంగా ఏపీలో కేవలం 20 శాతం గ్రామాలకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందాయని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపైనా, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు లెక్కలు, ఉత్తుత్తి ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం జగన్... జల్ జీవన్ మిషన్ లెక్కలనూ టాంపరింగ్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని 3,544 గ్రామాలకు 100 శాతం కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు లెక్కలు చూపారని, 735 (20.74%) గ్రామ పంచాయతీల్లో మాత్రమే పని పూర్తి చేశారని అన్నారు. మిగిలిన 80.26% మోసమేనని ఆయన ఆరోపించారు. ఇలాంటి తప్పుడు లెక్కలు చూపించడంలో జగన్ సిద్ధహస్తుడన్న బీజేపీ నేత.. ఇలాంటి  సలహాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా 45 మంది సలహాదారులను పెట్టుకొని వారికి రూ.130 కోట్లు ఖర్చు పెట్టారంటూ దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారం చేస్తూనే జగన్ మూడున్నరేళ్ల పాటు పాలన సాగించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News