Allu Sirish: అన్నయ్య సినిమాల్లో నాకు నచ్చినవి ఇవే: అల్లు శిరీష్
- తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్
- అల్లు అర్జున్ గురించి ప్రస్తావించిన వైనం
- ఆయన ఎంతో కష్టపడతాడంటూ వివరణ
- 'పుష్ప' .. 'రుద్రమదేవి' నిదర్శనమని వ్యాఖ్య
అల్లు అర్జున్ హీరోగా చేసిన 'గంగోత్రి' చూసినవారెవరూ కూడా, ఆయన ఈ రోజున ఈ స్థాయికి చేరుకుంటాడనే విషయాన్ని ఊహించి ఉండరు. సినిమాకి .. సినిమాకి ఆయన తనని తాను మార్చుకుంటూ .. మలచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి బన్నీ గురించిన ప్రస్తావన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో, అల్లు శిరీష్ ఇంటర్వ్యూలో వచ్చింది. అప్పుడు అల్లు శిరీష్ తనదైన శైలిలో స్పందించాడు.
శిరీష్ మాట్లాడుతూ .. "అన్నయ్య చేసిన సినిమాల్లో 'ఆర్య' .. 'ఆర్య 2' .. 'రేసుగుర్రం' .. 'సరైనోడు' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' అంటే నాకు చాలా ఇష్టం. 'పుష్ప' సినిమాలో అన్నయ్య చేసే రోల్ ఇది అని తెలిసినప్పుడు నేనేం కంగారు పడలేదు. అందుకు కారణం సుకుమార్ గారు. ఆయన ఒక పాయింట్ చుట్టూ కథను ఎలా అల్లుకుంటూ వెళతారనేది నాకు తెలుసు. ఆయనపై నాకు మంచి నమ్మకం ఉంది. అందువలన ఆ సినిమా బాగా వస్తుందని ముందుగానే అనుకున్నాను" అని చెప్పాడు.
"ఇక ఈ సినిమా కోసం అన్నయ్య చాలా కష్టపడ్డాడు. ఆ సినిమాలోని తన పాత్ర కోసం ప్రతి రోజు రెండు గంటలసేపు కూర్చుని చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేసేవాడు. ఇక అంతకంటే ముందు ఆయన 'రుద్రమదేవి' సినిమా చేశాడు. అందులో 'గోన గన్నారెడ్డి' పాత్ర కోసం ఆయన తెలంగాణ యాసను నేర్చుకోవటం కోసం కూడా అంతే కష్టపడ్డాడు. అంతగా కసరత్తు చేయడం వల్లనే ఆ పాత్రలు అంతగొప్పగా పండాయి" అంటూ చెప్పుకొచ్చాడు.