IMD: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... ఏపీకి భారీ వర్షసూచన
- నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం
- రెండ్రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు
- ఈ నెల 11, 12 తేదీల్లో వర్షాలు
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏపీకి వర్ష సూచన చేసింది. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఇదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది.
ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనించి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.
కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో 65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది.