Ravi Shastri: ఇంగ్లండ్ తో సెమీస్ కు పంత్, కార్తీక్ లలో ఎవరిని తీసుకోవాలో చెప్పిన రవిశాస్త్రి
- టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరిన టీమిండియా
- విఫలమైన పంత్, కార్తీక్
- ఎవరిని ఎంచుకోవాలో తెలియని సందిగ్ధతలో టీమిండియా
- పంత్ కే ఓటేసిన రవిశాస్త్రి
- జట్టులో ఓ లెఫ్ట్ హ్యాండర్ ఉండాలని వెల్లడి
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడుతూ సెమీస్ చేరినా, వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కోటాలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ ఇద్దరూ విఫలం కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇంగ్లండ్ తో సెమీస్ కు వీళ్లిద్దరిలో ఎవరిని తీసుకోవాలన్న సందిగ్ధత నెలకొంది.
దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇంగ్లండ్ తో మ్యాచ్ కు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో ఒక మార్పు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇంగ్లండ్ తో ఆడేటప్పుడు దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే, ఇంగ్లండ్ పై పంత్ కు మెరుగైన రికార్డు ఉందని గుర్తుచేశాడు.
జట్టులో ఇమిడిపోయే ఆటగాడిగా దినేశ్ కార్తీక్ ను విస్మరించలేమని, కానీ ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి బలమైన పేస్ అటాక్ ఉన్న జట్లపై ఆడేటప్పుడు మ్యాచ్ ను మలుపుతిప్పగల లెఫ్ట్ హ్యాండర్ అవసరం ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇటీవలే ఓ వన్డే మ్యాచ్ లో పంత్ రాణించడం వల్ల టీమిండియా గెలిచిందని వివరించారు.
సెమీస్ లో పంత్ కీలకం అయ్యే అవకాశాలున్నాయని, బలమైన ఇంగ్లండ్ పేస్ దళాన్ని కకావికలం చేయాలంటే పంత్ వంటి ఎడమచేతివాటం ఆటగాడు ఒకరు ఉండాలని శాస్త్రి తెలిపారు.
ఈ టోర్నీలో పంత్ జింబాబ్వేపై విఫలం కాగా, దినేశ్ కార్తీక్ తాను ఆడిన మ్యాచ్ లలో 1, 6, 7 పరుగులు స్కోరు చేసి నిరాశపరిచాడు. దాంతో వీళ్లద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలన్నది టీమిండియాకు ఓ సమస్యలా మారింది.