Andhra Pradesh: అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా
- ఇటీవలే గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సుచరిత
- అదే బాటలో నడిచిన కాపు రామచంద్రారెడ్డి
- కుటుంబ సమస్యలు, నియోజకవర్గంపై దృష్టి సారించేందుకే రాజీనామా అని వెల్లడి
- పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖను పంపిన రాయదుర్గం ఎమ్మెల్యే
వైసీపీలో పార్టీ పదవులను వీడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి ఆ పార్టీ కీలక నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
జగన్ కు రాసిన లేఖలో తన రాజీనామాకు గల కారణాలను రామచంద్రారెడ్డి వివరించారు. రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కూతురు భర్త ఆత్మహత్యతో రామచంద్రారెడ్డి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈ క్రమంలో అటు నియోజకవర్గంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం తనకు కష్టంగా మారిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంపై దృష్టి సారించాల్సి ఉన్నందున పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను తాను పర్యవేక్షించలేనని, ఆ పదవిని మరో నేతకు అప్పగించాలని ఆయన జగన్ ను కోరారు.