Bihar: దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల.. విశాఖ, హైదరాబాద్‌కు చోటు
- అత్యంత కాలుష్య నగరంగా బీహార్‌లోని కతిహార్
- దారుణంగా పడిపోయిన గాలిలో నాణ్యత
- ఏపీలో విశాఖతోపాటు అనంతపురం, తిరుపతి, ఏలూరు కూడా జాబితాలోకి
- హైదరాబాద్‌లో గాలిలో నాణ్యత 100 పాయింట్లుగా నమోదు
బీహార్‌లోని కతిహార్ దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో అగ్రస్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో ఏపీలోని విశాఖపట్టణంతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) నిన్న కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కతిహార్‌లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోగా, ఢిల్లీలో 354, నోయిడాలో 328, ఘజియాబాద్‌లో 304 పాయింట్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
బీహార్‌లోని బెగుసరాయ్, హర్యానాలోని బల్లాబ్‌గఢ్, ఫరీదాబాద్, కైతాల్, గురుగ్రామ్, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కూడా కాలుష్య కారక నగరాల జాబితాలో చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్టణం, హైదరాబాద్ కూడా కాలుష్య నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్టణంలో గాలిలో నాణ్యత 202 పాయింట్లుగా ఉండగా, హైదరాబాద్‌లో 100 పాయింట్లుగా ఉంది. ఇక, అనంతపురం (145), తిరుపతి (95), ఏలూరు (61) కూడా ఈ జాబితాలో చేరాయి.