central minister: హైవే మధ్యలో ఆగిన బస్సు.. ప్రయాణికులతో కలిసి తోసిన కేంద్ర మంత్రి
- హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ దగ్గర్లో ఘటన
- ప్రయాణికుల కష్టాలను అడిగి తెలుసుకున్న మంత్రి
- రాష్ట్రంలో బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న క్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కు విచిత్ర అనుభవం ఎదురైంది. హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో మంత్రి కాన్వాయ్ కూడా ఆగింది. ఏం జరిగిందని చూడగా.. రోడ్డు మధ్యలో ఓ బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులతో కలిసి కేంద్రమంత్రి కూడా బస్సును రోడ్డు పక్కకు నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీ నుంచి బయల్దేరారు. బిలాస్ పూర్ దగ్గర్లో హైవేపైన ఓ బస్సు బ్రేక్ డౌన్ అయింది. రోడ్డు ఇరుకుగా ఉండడం, నడిరోడ్డుపైన బస్సు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ప్రయాణికులంతా కిందికి దిగి బస్సును పక్కకు నెడుతున్నారు. అక్కడి ట్రాఫిక్ లో చిక్కుకున్న మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇది గమనించి కారు దిగొచ్చారు.
ప్రయాణికులతో కలిసి బస్సును పక్కకు నెట్టారు. ఆ తర్వాత బస్సు ప్రయాణికులతో పాటు అక్కడ గుమికూడిన జనాలతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని బీజేపీకి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో రోడ్లను బాగుచేస్తామని, కొత్త రోడ్లు వేసి అభివృద్ధి చేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యాక మంత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయారు.
https://twitter.com/ANI/status/1589996965554966535?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1589996965554966535%7Ctwgr%5E70020bbd1850153f5382acb5dd6c6c3e7816529d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnownews.com%2Findia%2Fstuck-in-traffic-jam-anurag-thakur-pushes-bus-after-it-breaks-down-on-himachal-highway-video-article-95385060