Tamil Nadu: ఈ గవర్నర్ మాకొద్దు.. తొలగించండి: స్టాలిన్
- రాష్ట్రపతికి తమిళనాడు సర్కారు మెమోరాండం
- రాష్ట్రంలో అశాంతి రేకెత్తించేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ
- ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్య
తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. కొంతకాలంగా రాష్ట్రంలో కొనసాగుతున్న వివాదం తాజాగా ఢిల్లీకి చేరింది. ఇలాంటి గవర్నర్ మాకొద్దంటూ డీఎంకే ప్రభుత్వం ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమోరాండం సమర్పించింది. గవర్నర్ ను వెంటనే తొలగించాలని కోరింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని స్టాలిన్ సర్కారు ఆరోపించింది. ప్రజలకు సేవ చేయకుండా తమకు మోకాలడ్డుతున్నారని విమర్శలు గుప్పించింది.
గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు చేసిన ప్రమాణాలను ఆర్ఎన్ రవి ప్రస్తుతం లెక్కచేయడంలేదని, నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడతానంటూ చేసిన ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘించారని విమర్శిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులను ఉద్దేశపూర్వకంగా అపేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ పాస్ చేసి పంపిన 20 బిల్లులను తొక్కిపెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆర్ఎన్ రవి చేసే వ్యాఖ్యలు కొన్ని వర్గాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వంపై తిరగబడేలా పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా రాష్ట్రపతికి సమర్పించిన మెమోరాండంలో తమిళనాడు సర్కారు వివరించింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే గవర్నర్ గా కొనసాగడానికి ఆర్ఎన్ రవి అనర్హుడని తెలిపింది.