T20 World Cup: సెమీస్ ముంగిట టెన్షన్.. గాయంతో ప్రాక్టీస్ నుంచి వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ!
- నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డ కోహ్లీ
- హర్షల్ పటేల్ వేసిన బంతి గజ్జల్లో తగిలి గాయం
- రేపు ఇంగ్లండ్ తో సెమీఫైనల్ ఆడనున్న భారత్
టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో సెమీఫైనల్ కు ముందు భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. సూపర్ ఫామ్ లో ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. నెట్స్ లో పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఓ బంతి గజ్జల్లో తగలడంతో కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. నొప్పి ఎక్కువ కావడంతో కాసేపటి తర్వాత నెట్స్ నుంచి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లీకి అయిన గాయంపై అటు భారత జట్టు, ఇటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
నిన్న కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం ఇలానే స్వల్ప గాయానికి గురయ్యాడు. త్రౌ డౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి రోహిత్ కుడి ముంజేయికి గట్టిగా తగిలింది. దాంతో, రోహిత్ నొప్పితో విలవిలలాడాడు. అయితే, 40 నిమిషాల తర్వాత తను మళ్లీ ప్రాక్టీస్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకునున్నారు. రోహిత్ ఘనట మరవకముందే కోహ్లీ గాయపడిన వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 123 సగటుతో 246 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తో గురువారం జరిగే సెమీఫైనల్లో తను బరిలోకి దిగుతాడో లేదో చూడాలి.