- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసిన వైనం
- హాఫ్ సెంచరీతో అలరించిన డారిల్ మిషెల్
- కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న కేన్ విలియమ్సన్
టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శనతో సొంత దేశ అభిమానుల చేత చీవాట్లు తిని కూడా... ఇతర జట్ల ద్వారా కలిగిన అయాచిత లబ్ధితో సెమీస్ చేరిన పాకిస్థాన్ ముందు న్యూజిలాండ్ పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. టీ20 యావరేజ్ స్కోరు చేయగలిన న్యూజిలాండ్ ప్రత్యర్థి జట్టు భయపడే లక్ష్యాన్ని మాత్రం నిర్దేశించలేకపోయింది. బుధవారం మధ్యాహ్నం సిడ్నీలో ప్రారంభమైన తొలి సెమీ ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు... తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుని పాకిస్థాన్ కు ఛేజింగ్ ను అప్పగించింది.
న్యూజిలాండ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో తొలి ఓవర్ లోనే న్యూజిలాండ్ ఓపెనర ఫిన్ అలెన్ (4)ను షహీన్ అఫ్రీదీ వికెట్ల ముందు దొరకబుచ్చేసుకున్నాడు. తొలి ఓవర్ లో మూడో బంతికే తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను మరో ఓపెనర్ డేవాన్ కాన్వే (21) ఒకింత నిలువరించగలిగాడు. అయితే 5వ ఓవర్ లో అతడు కూడా అవుట్ కావడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో తొలి ఓవర్ లోనే క్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46) పాక్ బౌలర్ల సహనాన్ని పరీక్ష పెట్టాడు. కాన్వే అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (6) వెంటనే అవుట్ అయ్యాడు.
అయితే ఆ తర్వాత నాలుగో వికెట్ తీయడానికి పాక్ బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్ తో కలిసి డారిల్ మిచెల్ (53) న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించాడు. జట్టు స్కోరు సెంచరీ దాటేసిన తర్వాత కెప్టెన్ కూడా అవుట్ కావడంతో చివర్లో జేమ్స్ నీషమ్ (16) బ్యాటును ఝుళిపించాడు. మిచెల్ హాఫ్ సెంచరీతో, విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 152 పరుగులు చేసి పాకిస్థాన్ కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.