T20 World Cup: న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలుపు... టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన బాబర్ సేన

pakistan beat new zealand and enters into t20 world cup final

  • పాక్ బౌలర్ల ధాటికి పరుగులు చేయడానికి కష్టపడ్డ న్యూజిలాండ్ బ్యాటర్లు
  • 153 పరుగుల లక్ష్యాన్ని 5 బంతులు మిగిలి ఉండగానే చేరుకున్న పాక్
  • తిరిగి ఫామ్ లోకి వచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజం
  • హాఫ్ సెంచరీలు చేసిన రిజ్వాన్, బాబర్
  • రేపటి విజేతతో ఫైనల్ ఆడనున్న పాకిస్థాన్ జట్టు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పాకిస్థాన్ జట్టు చేరిపోయింది. లీగ్ దశలో పేలవ ప్రదర్శనతో అసలు సెమీస్ చేరుతుందా? అన్న అనుమానాలు కలిగించిన పాక్ జట్టు... ఇతర జట్ల పుణ్యమా అని సెమీస్ చేరి... బుధవారం జరిగిన తొలి సెమీస్ లో వరల్డ్ కప్ టైటిల్ పై ఏళ్ల తరబడి ఆశలు పెట్టుకున్న న్యూజిలాండ్ ను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సిడ్నీ వేదికగా కాసేపటి క్రితం ముగిసిన సెమీస్ లో పటిష్ఠంగా కనిపించిన న్యూజిలాండ్ జట్టుపై ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన బాబర్ సేన... సగర్వంగా ఫైనల్ చేరింది. రేపు జరగనున్న రెండో సెమీస్ లో గెలిచే జట్టుతో పాక్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

ఉత్కంఠభరితంగా సాగుతుందని భావించిన నేటి సెమీస్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోగా... అందివచ్చిన ఛేజింగ్ అవకాశాన్ని పాక్ సద్వినియోగం చేసుకుంది. బౌలింగ్ లో పెద్దగా వికెట్లు తీయని పాక్ బౌలర్లు ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేయకుండా నిలువరించగలిగారు. పాక్ బౌలర్ల పొదుపు బౌలింగ్ తో ఇబ్బంది పడ్డ న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ తర్వాత 153 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్... 20వ ఓవర్ లో ఇంకో 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేజ్ చేసింది.

ఛేజింగ్ లో మొహ్మద్ రిజ్వాన్ (57) తో కలిసి పాక్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన జట్టు కెప్టెన్ బాబర్ ఆజం (53) ధాటిగా ఆడాడు. అటు రిజ్వాన్ తో పాటు ఇటు బాబర్ కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ ను తుత్తునియలు చేసిన రిజ్వాన్, బాబర్ లు 13వ ఓవర్ దాకా వికెట్ పడకుండా ఆడారు. ఓపెనర్లిద్దరూ ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా లేకుండానే హాఫ్ సెంచరీలు చేయడం గమనార్హం. 

13వ ఓవర్ లో బాబర్ అవుట్ కాగా... 17వ ఓవర్ లో రిజ్వాన్ కూడా అవుటయ్యాడు. అప్పటికే టార్గెట్ కు చేరువైన పాక్ ను మొహ్మద్ హ్యారిస్ (30) మరింత చేరువ చేశాడు. హ్యారిస్ అవుటైన తర్వాత షాన్ మసూద్ (3), ఇఫ్తికార్ అహ్మద్ (0) ఏమాత్రం కష్టపడకుండానే పాక్ ను విజయతీరాలకు చేర్చారు. వెరసి తన ఇన్నింగ్స్ లో ఇంకో 5 బంతులు మిగిలి ఉండగానే.... 153 పరుగులు చేసిన పాక్... న్యూజిలాండ్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సగర్వంగా ఫైనల్ చేరింది.

  • Loading...

More Telugu News