Andhra Pradesh: సొంత సామాజిక వర్గానికే జగన్ పెద్దపీట.. చంద్రబాబు అన్యాయం చేయలేదని సుచరితే చెప్పారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

tdp mla gorantla butchaiah chowdary fires over dsp promotions
  • టీడీపీ హయాంలో ఒకే కులానికి పదవులు ఇవ్వలేదన్న గోరంట్ల
  • డీఎస్పీ ప్రమోషన్లలో అన్ని కులాల వారికీ అవకాశం కల్పించామని వెల్లడి
  • చంద్రబాబుపై జగన్ సహా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
  • బడుగు, బలహీన వర్గాలను జేసీబీతో అణగదొక్కుతున్నారని ధ్వజం
పోలీసు శాఖ ప్రమోషన్లలో... ప్రత్యేకించి డీఎస్పీ ప్రమోషన్లలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారని టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీల ప్రమోషన్లపై కీలక వివరాలు వెల్లడించారు. 

టీడీపీ హయాంలో ఒకే కులానికి పదవులు కట్టబెట్టలేదని సాక్షాత్తు హోం శాఖ మంత్రి హోదాలో మేకతోటి సుచరిత అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా డీఎస్పీల ప్రమోషన్లలో చంద్రబాబు ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదని సుచరిత చెప్పారన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సుచరిత లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని ఆయన చెప్పారు. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టారని ఆరోపించిన సీఎం జగన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై నాడు జగన్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయిందని బుచ్చయ్య చౌదరి అన్నారు. డీఎస్పీ ప్రమోషన్లలో 37 మందిలో 35 మందికి ఒకే సామజిక వర్గానికి చంద్రబాబు ప్రమోషన్లు ఇచ్చారనడం అసత్యమని ఆయన తెలిపారు. నాటి డీఎస్పీ ప్రమోషన్‌ లలో 17 మంది ఓసీ, 12 మంది బీసీ, ఆరుగురు ఎస్సీ, ఒక ఎస్టీ ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో సొంత సామాజికవర్గానికి పోస్టింగ్‌ వేయించుకుంటోందని ఆయన ఆరోపించారు. 

ఈ క్రమంలో మంగళవారం 53 మంది డీఎస్పీలకు పోస్టింగ్‌ వేయగా, అందులో 25% మంది జగన్ సొంత సామాజికవర్గం వారే ఉన్నారన్నారు. 29 సబ్‌ డివిజన్లలో 19 మంది జగన్ సొంత కులం వారే ఉన్నారన్నారు.  ఒక్క కాపుకు కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదన్నారు. ప్రముఖ పట్టణాల్లో ఒక్క బీసీకి, ఎస్సీకి గానీ పోస్టింగ్‌ లేదన్నారు. ప్రతి ప్రాంతంలోనూ జగన్ తన సొంత సామాజికవర్గానికే పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా ఫరవాలేదు అన్న విధంగా జగన్‌రెడ్డి తన సొంత సామాజికవర్గాన్ని పెంచి పోషిస్తూ బడుగు బలహీనవర్గాలను జేసీబీలతో, రోడ్డు రోలర్లతో అణగదొక్కుతున్నారని ఆయన విమర్శించారు. 

నామినేటెడ్‌ పోస్టుల్లో, సలహాదారుల్లో, చట్టసభల పదవుల్లో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి శాఖలో అంతా జగన్ సొంత సామాజికవర్గానికి చెందిన వారికే అవకాశాలు దక్కుతున్నాయని గోరంట్ల ఆరోపించారు. 2017లో ఏసీబీకి అడ్డంగా దొరికిన డీఎస్పీ వై.హరనాథ్‌రెడ్డిని టెక్కలి డీఎస్పీగా నియమించారన్నారు. హరనాథరెడ్డి మీద అనేక అభియోగాలున్నాయన్న బుచ్చయ్య.... కర్నూలు, కడప, అనంతపురం, బెంగుళూరులో ఆయన పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కూడబెట్టారని ఆరోపించారు. 

నిజాయతీగా పనిచేసే బీసీ, ఎస్సీ అధికారులకు పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసేసిన వారికే ఇప్పుడు పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. ప్రభుత్వ చర్యలతో పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర అనిశ్చితి, అసంతృప్తి నెలకొన్నాయన్నారు. రాత్రింబవళ్లు శాంతిభద్రతలు కాపాడే పోలీసు అధికారులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించిన గోరంట్ల... మీ సామాజికవర్గం కాకపోతే పోస్టింగ్‌ ఇవ్వరా? అని జగన్ ను నిలదీశారు. 

డీఎస్పీ ప్రమోషన్లలో 37 మందికి గాను ఒకే సామాజిక వర్గానికి చెందిన 35 మందికి చంద్రబాబు అవకాశం కల్పించారంటూ జగన్‌ తో పాటు వైసీపీ నేతలంతా ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారని బుచ్చయ్య ధ్వజమెత్తారు. దీనిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సైతం తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. నాడు ప్రమోషన్లు దక్కిన 17 మంది ఓసీ అధికారుల్లో ఐదుగురు కమ్మ, ముగ్గురు కాపు, ముగ్గురు రెడ్డి, ముగ్గురు బ్రాహ్మణులున్నారన్నారు. ఇద్దరు రాజు, మరొకరు ఇతర ఓసీ కులానికి చెందిన వారు ఉన్నారని చెప్పారు. టీడీపీ హయాంలో ఒకే కులానికి పదవులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. జగన్ తనకున్న కులపిచ్చితో 800 నామినేటెడ్‌ పోస్టులను తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారని బుచ్చయ్య ఆరోపించారు.
Andhra Pradesh
TDP
YSRCP
YS Jagan
Chandrababu
Gorantla Butchaiah Chowdary
AP Police
DSP Promotions
Mekathoti Sucharitha
AP Assembly

More Telugu News