Mark Zukerberg: జుకెర్ బర్గ్ సంచలన నిర్ణయం... ఫేస్ బుక్ నుంచి 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన
- ఉద్యోగుల తొలగింపుపై ప్రకటన విడుదల చేసిన జుకెర్ బర్గ్
- సంస్థలో 13 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన
- ఉద్వాసనకు గురైన వారికి 16 వారాల వేతనాన్ని చెల్లిస్తామని వివరణ
- సంస్థలో పనిచేసిన కాలానికి ఏడాదికి 2 వారాల అదనపు వేతనం ఇస్తామని వెల్లడి
- 6 నెలల పాటు ఆరోగ్య బీమాను కొనసాగించనున్నట్లు ప్రకటన
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో 13 శాతం మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ బుధవారం సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఫేస్ బుక్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 13 శాతం... అంటే దాదాపుగా 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఫేస్ బుక్ ప్రారంభమైన నాటి నుంచి ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ఇదే అంశాన్ని ప్రస్తావించిన జుకెర్ బర్గ్... ఇది తనకు అత్యంత కష్టమైన నిర్ణయమని, అయినా కూడా సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.