Lucknow: వరుడి తండ్రి తెచ్చిన లెహంగా నచ్చలేదని.. పెళ్లినే రద్దు చేసుకున్న వధువు
- ఈ నెల 5న వివాహానికి ఏర్పాట్లు
- వధువు కోసం లక్నో నుంచి ఖరీదైన లెహంగా తెప్పించిన వరుడి తండ్రి
- నచ్చలేదని వధువు చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ
- లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లి రద్దు చేసుకున్న వరుడి కుటుంబం
ఉత్తరాఖండ్‌లో విచిత్ర ఘటన జరిగింది. వరుడి తరపు వారు తెచ్చిన లెహంగా నచ్చలేదన్న కారణంగా ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుందో వధువు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో చివరికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హల్ద్వానీకి చెందిన యువతికి, అల్మోరాకు చెందిన యువకుడికి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 5న వివాహం జరగాల్సి ఉండగా వరుడి తరపు వారు శుభలేఖలు కూడా ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేశారు.
ఈ క్రమంలో వధువు కోసం వరుడి తండ్రి లక్నో నుంచి ఖరీదైన లెహంగా తెప్పించి దానిని యువతికి అందించారు. అయితే, అది చూసిన వధువు పెదవి విరిచింది. అది తనకు నచ్చలేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ విషయం వరుడి ద్వారా వారి ఇంట్లో తెలియడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇక లాభం లేదని, పెళ్లి జరిగేది లేదంటూ యువకుడి కుటుంబ సభ్యులు గత నెల 30న యువతి ఇంటికి చేరుకుని లక్ష రూపాయలు ఇచ్చి వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
అయితే, ఆ తర్వాత వధువు తరపు వారు యువకుడి ఇంటికి చేరుకుని మళ్లీ వివాహ ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో వారి మధ్య మరోవారు వాగ్వివాదం జరిగింది. చివరికి ఈ గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. దీంతో పెళ్లి రద్దు చేసుకున్నట్టు ఇరు వర్గాలు ప్రకటించాయి.