- మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోసం జాక్వెలిన్ పిటిషన్
- బెయిల్ ఇవ్వొద్దంటూ వాదనలు వినిపించిన ఈడీ
- రేపు తీర్పును ప్రకటించనున్న కోర్టు
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలో ఢిల్లీ కోర్టు ఊహించని ప్రశ్న సంధించింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తుండగా.. ఆమె ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకుంది.
దీనిపై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. దీనికి నటి జాక్వెలిన్ కూడా హాజరయ్యింది. అసలు ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ జడ్జి ప్రశ్నించారు. జాక్వెలిన్ కు బెయిల్ ఇవ్వడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యంతరం తెలిపింది. ఆమె దేశం విడిచి పారిపోయే అవకాశాలున్నాయని వాదించింది. విచారణకు ఆమె ఎంత మాత్రం సహకరించలేదని, ఆధారాలు చూపించిన వాటి విషయంలోనే వివరాలు వెల్లడించినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది.
దీంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్ పై శుక్రవారం తీర్పు వెలువరించనుంది. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగనుండడంతో ఈ కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం. ఢిల్లీ అధికార పార్టీ 'ఆప్' అగ్ర నేతలు తన నుంచి పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేయడంతో, తాను సర్దుబాటు చేసినట్టు సుకేశ్ ప్రకటన చేయడం తెలిసిందే.