T20 World Cup: ఫైనల్ లో మీ ప్రత్యర్థి భారత్ అయితే అన్న ప్రశ్నకు.. పాక్ కెప్టెన్ బాబర్ జవాబు!
- ఇప్పటికే ఫైనల్ చేరిన పాకిస్థాన్ జట్టు
- ఫైనల్ లో తమ ప్రత్యర్థి ఎవరన్నది సమస్యే కాదన్న బాబర్
- భారత్ అయినా, ఇంగ్లండ్ అయినా ఇబ్బందేమీ లేదని వ్యాఖ్య
- 100 శాతం ఉత్తమ ప్రదర్శన కోసం కష్టపడతామన్న పాక్ కెప్టెన్
టీ20 వరల్డ్ కప్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే తొలి సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరితే... తాజాగా గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన రెండో సెమీస్ లో గెలిచే జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత జట్టు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఛేజింగ్ ను ఎంచుకుని భారత జట్టును తొలుత బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
భారత్, ఇంగ్లండ్ ల మధ్య మ్యాచ్ ప్రారంభం కాకముందే... రెండో సెమీస్ , అందులో నెగ్గే అవకాశాలున్న టీమిండియా ఫైనల్ వస్తే ఏం చేస్తారంటూ పాక్ కెప్టెన్ బాబర్ అజంకు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఏమాత్రం ఇబ్బంది లేకుండానే బాబర్ స్పందించాడు. ఫైనల్ లో తమకు ప్రత్యర్థిగా వచ్చే జట్టు ఏదో ఇప్పుడే చెప్పడం కష్టమని అతడు వ్యాఖ్యానించాడు. అయితే ఫైనల్ లో తమ ప్రత్యర్థి ఇటు భారత్ అయినా, అటు ఇంగ్లండ్ అయినా పెద్దగా తేడా ఏమీ ఉండదని చెప్పాడు. తమ ప్రత్యర్థి ఏ జట్టు అన్న విషయాన్ని పక్కనపెట్టేసి టైటిల్ పోరులో వంద శాతం ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కష్టపడతామని అతడు చెప్పాడు.
ఓ జట్టుగా ఎప్పుడైనా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే కష్టపడతామని బాబర్ అన్నాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకే యత్నిస్తామని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను దాటుకుని టైటిల్ పోరుకు చేరుకున్న విషయాన్ని అతడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అలాంటప్పుడు ఫైనల్ లో జట్టు ఏదనే భయం లేకుండా ఆడాల్సిన అవసరం ఉంది. గడచిన 3, 4 మ్యాచ్ లలో ఇదే పంథాను కొనసాగిస్తున్నాం. ఫైనల్ లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తామని బాబర్ చెప్పాడు. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్ కప్ తొలి టోర్నీ 2007లో జరగగా... నాడు భారత్, పాక్ ల మధ్యే ఫైనల్ జరగగా... పాక్ ను చిత్తు చేసిన ధోనీ సేన పొట్టి ప్రపంచ కప్ తొలి టైటిల్ ను ఎగురవేసుకుపోయింది.