Nimmala Rama Naidu: ప్రజాకవి వేమన కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పవాడా?: నిమ్మల రామానాయుడు
- యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం తొలగింపు
- వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడంపై విమర్శలు
- జగన్ పిచ్చి చేష్టలకు చరమగీతం పాడాలన్న నిమ్మల
కడప యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని తొలగించి వేమనను అవమానపరిచారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానాయుడు మాట్లాడారు. జగన్ రెడ్డి విధ్వంసక పాలన ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలై అనేక కొత్త పుంతలు త్రొక్కుతూ పరాకాష్ఠకు చేరిందని అన్నారు.
నిన్న కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలోని ప్రజాకవి వేమన విగ్రహాన్ని తొలగించి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహం ప్రతిష్టించుకునే స్థాయికి జగన్ రెడ్డి దిగజారాడు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
"దీని ద్వారా జగన్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రజాకవి వేమన కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పవాడా? వేమన తన జీవితం మొత్తం ప్రజలలో తిరుగుతూ మూఢనమ్మకాలపై, విలువలపై, కుల వివక్షలపై చైతన్యం తీసుకొచ్చిన గొప్ప కవి. వేమన తెలుగుజాతికి మంచి సాహిత్యాన్ని అందించిన ఒక రత్నంలాంటివాడు.
400 ఏళ్ల చరిత్ర కలిగి చారిత్రక పురుషుడు వేమనకు తెలుగుదేశం పార్టీ గౌరవం ఇచ్చి నాడు ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. తెలుగుజాతి కీర్తిప్రతిష్టలు ఇనుమడింపచేసేలా ఎన్టీఆర్ చేస్తే.. నేడు తెలుగువారి కీర్తిప్రతిష్టలు దెబ్బతీసేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే పదాలు జగన్ రెడ్డికి తప్ప రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆదర్శమయ్యాయి. అందుకే యోగివేమన విశ్వవిద్యాలయం లోని వేమన విగ్రహాన్ని తొలగించాడు.
రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే మహాపురుషులైన గురజాడ, శ్రీశ్రీ, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారి విగ్రహాలు కూడా కనిపించవని ప్రజలు అనుకుంటున్నారు. భవిష్యత్తులో గ్రామ దేవతల విగ్రహాలను కూడా తీసేసి జగన్ తన తండ్రి విగ్రహాలను పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యోగి వేమన విగ్రహ తొలగింపుపై గవర్నర్ స్పందించాలి. విజ్జులైన ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆలోచన చేయాలి. జగన్ రెడ్డి పిచ్చి చేష్టలకు చరమగీతం పాడాలి" అంటూ నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.