Andhra Pradesh: సీఎం జగన్ తో ఎంపీ గోరంట్ల మాధవ్ భేటీ... కుల సంఘాల నేతలతో కలిసి వచ్చిన ఎంపీ
- మదారి కురువ, మదాసి కురువ కులాలతో కలిసి తాడేపల్లి వచ్చిన ఎంపీ మాధవ్
- ఈ కులాల కుల ధ్రువీకరణ పత్రాల జారీని ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ కార్యాలయాలకు మార్చిన జగన్ సర్కారు
- కుల సంఘాలతో కలిసి జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మదాసి కురువ, మదారి కురువ కుల సంఘం నేతలతో కలిసి గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వచ్చిన గోరంట్ల మాధవ్... సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ రెండు కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేసిన జగన్ కు ఎంపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో మదారి కురువ, మదాసి కురువ కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రాలను మొన్నటి దాకా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) కార్యాలయాల్లో మాత్రమే జారీ చేశారు. దీని వల్ల కుల ధ్రువీకరణ పత్రాలకు కూడా ఈ రెండు కులాల వారు రెవెన్యూ డివిజన్ కు వెళ్లేవారు. అయితే ఇటీవలే ఈ కులాల వారి కుల ధ్రువీకరణ పత్రాల జారీని ఆర్డీఓ కార్యాలయాల నుంచి మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎంఆర్ఓ) కార్యాలయాలకు మార్చారు. ఈ మేర వెసులుబాటు కల్పించినందుకు ఈ రెండు కులాల సంఘాల నేతలతో కలిసి గోరంట్ల సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.