Diabetes: మధుమేహంపై ఈ అపోహలను నమ్మవద్దు!

Myths about Diabetes

  • ప్రపంచంలో అన్ని వయసుల వారిని వేధిస్తున్న డయాబెటిస్
  • చాలామందిలో కొరవడుతున్న అవగాహన
  • ఇదొక జబ్బు అని అత్యధికుల భావన
  • ఇదొక శరీర సమస్య అని నిపుణుల వెల్లడి

మధుమేహం (డయాబెటిస్) అంటే షుగర్ అనే జబ్బు అని చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి మధుమేహం అనేది జబ్బు కాదు... శరీరంలో తలెత్తే ఒక సమస్య. మనం తిన్న ఆహారాన్ని శరీరం శక్తిగా మార్చుకోలేకపోవడమే మధుమేహం. 

పేంక్రియాస్ మన శరీరంలో ఒక కీలక గ్రంథి. ఇది ఉత్పత్తి చేసే ఇన్సులిన్ హార్మోను మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ ను శక్తిగా మార్చి కణజాలాలకు చేరవేస్తుంది. మధుమేహం సమస్యతో బాధపడుతున్నప్పుడు శరీరం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేకపోతుంది, లేక ఇన్సులిన్ ను సరిగా వినియోగించుకోలేకపోతుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్ లేక చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఈ దశలో చికిత్స ప్రారంభించకపోతే శరీర జీవక్రియలు మందగించి, కీలక అవయవాల పనితీరు క్షీణిస్తుంది. అనంతరం ప్రాణాంతకం అవుతుంది. 

ఈ డయాబెటిస్ విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

అపోహ 1: మధుమేహ బాధితులు చక్కెరతో కూడిన ఆహారం, డ్రింకులు తీసుకోకూడదు.

వాస్తవం: దైనందిన ఆహారంలో ప్రతి ఒక్కరు శక్తి కోసం చక్కెరలు, పిండిపదార్థం (స్టార్చ్) తీసుకోవడం తప్పనిసరి. మధుమేహం ఉందంటే చక్కెరలు, పిండిపదార్థం ఏమాత్రం తీసుకోకూడదని కాదు... కాకపోతే ప్రణాళికాబద్ధంగా డైట్ తీసుకోవాలి. మధుమేహ బాధితులు తాము తీసుకునే ఆహారం విషయంలో సరైన పద్ధతులు పాటించాలి. తక్కువ ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలు, సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంలో చక్కెర, పిండిపదార్థం సమతులంగా ఉంటాయి. మీకు డయాబెటిస్ ఉంటే వైద్యుడ్ని సంప్రదించి సరైన ఆహారం గురించి తెలుసుకోవాలి.

అపోహ 2: టైప్-2 డయాబెటిస్ పెద్దవాళ్లకే వస్తుంది

వాస్తవం: వయసుతో పాటే శరీర పటుత్వం తగ్గడం సాధారణంగా జరిగే విషయమే. దాంతో పెద్దవాళ్లలో కొందరు టైప్-2 డయాబెటిస్ బారినపడుతుంటారు. అంతమాత్రాన కేవలం పెద్దవాళ్లకే ఇది పరిమితం అనుకోరాదు. పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ టైప్-2 కేసులు పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇష్టంవచ్చినట్టు తిండి తినడం ద్వారా, శారీరక శ్రమ లేకుండా ఊబకాయుల్లా తయారయ్యే పిల్లల్లోనూ టైప్-2 డయాబెటిస్ కనిపిస్తుంది. పిల్లలైనా, పెద్దలైనా క్రమబద్ధమైన జీవనశైలి చాలా ముఖ్యం.

అపోహ 3: కేవలం అధిక కొవ్వుతో బాధపడుతున్నవాళ్లకు మధుమేహం వస్తుంది

వాస్తవం: అధిక బరువుతో బాధపడుతున్నవాళ్లకు డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉంటుందన్నది నిజమే. అయితే ఊబకాయులైన ప్రతి ఒక్కరికీ మధుమేహం వస్తుందని చెప్పలేం. బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్)కి తగిన బరువు ఉన్నవాళ్లు, బరువు తక్కువగా ఉన్నవాళ్లు కూడా మధుమేహం బారినపడే అవకాశం ఉంది.

అపోహ 4: డయాబెటిస్ తో బాధపడేవాళ్లు కేవలం డయాబెటిక్ ఫుడ్ మాత్రమే తినాలి

వాస్తవం: మధుమేహ బాధితులు 'డయాబెటిక్' అని లేబుల్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని బ్రిటన్ కు చెందిన డయాబెటిస్ చారిటీ చెబుతోంది. డయాబెటిస్ రోగుల కోసం అంటూ తయారుచేసే స్వీట్లు తదితర పదార్థాల్లో సాధారణ చక్కెరకు బదులు షుగర్ ఆల్కహాల్స్, స్వీటెనర్లను ఉపయోగిస్తారు. ఎప్పుడూ వీటినే తినడం మంచిది కాదు. ఇవి కూడా రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలకు దారితీస్తాయి. పైగా ఈ డయాబెటిక్ ఫుడ్ ఖరీదైనదే కాకుండా, కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అపోహ 5: మధుమేహం వస్తే కంటి చూపు పోతుంది, పుండ్లు పడితే కాళ్లు తీసేయాల్సి వస్తుంది

వాస్తవం: ఒక్కసారి డయాబెటిస్ నిర్ధారణ అయ్యాక చికిత్స ఆపరాదు. డయాబెటిస్ తో అంధత్వం, కాళ్లు తీసేయాల్సి రావడం అనేది అన్ని కేసుల్లో జరగదు. మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తపోటు, గ్లూకోజ్ స్థాయి, బరువును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడంతో పాటు, ధూమపానానికి దూరంగా ఉండడం ద్వారా కంటిచూపు సమస్యలు, కాళ్ల సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. కంటిచూపు, కాళ్ల సమస్యలు అనేవి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించదగ్గవే. అందుకే ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటుండాలి.

  • Loading...

More Telugu News