- భారత జట్టు ఆటతీరును ఏకిపారేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
- ప్రపంచ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ లో ఆడి చూపిస్తున్నారంటూ కామెంట్
- భారత్ సాధించిందేమిటని ప్రశ్నించిన వాన్
భారత క్రికెట్ జట్టు ఆట విషయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ దారుణ వ్యాఖ్యలు చేశాడు. అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలు ఆలోచింపజేసేవిగానే ఉన్నాయి. సగటు భారత క్రికెట్ అభిమాని మాదిరే ఆయన కూడా తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచే జట్టు భారత్ అని వాన్ వ్యాఖ్యానించాడు.
భారత జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిపోవడం తెలిసిందే. భారత బౌలర్లు కనీసం ఒక్క వికెట్ ను కూడా తీయలేకపోవడం జీర్ణించుకోలేకుండా ఉంది. 2011 వన్డే ప్రపంచకప్ ను ధోనీ సారథ్యంలో గెలవడమే భారత్ కు చివరి ప్రపంచ కప్ కావడం గమనించాలి.
‘‘50 ఓవర్ల వరల్డ్ కప్ గెలిచిన దగ్గర్నుంచి వారు (భారత్) ఏం సాధించారు? ఏమీ లేదు. భారత్ ఆడే వైట్ బాల్ గేమ్ (పరిమిత ఓవర్ల క్రికెట్) పాతం కాలం నాటిది. పరిమిత ఓవర్ల క్రికెట్ చరిత్రలో భారత్ అత్యంత చెత్తగా ఆడే జట్టు. ప్రపంచంలోని ప్రతి ఆటగాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు వెళ్లి (భారత్ ఆటగాళ్లు) ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో చూపిస్తున్నారు. కానీ, ఇండియా ఇప్పటి వరకు ఏం అందించింది?’’ అంటూ వాన్ భారత్ జట్టు వైఫల్యంపై పోస్ట్ మార్టమ్ నిర్వహించినంత పనిచేశాడు.
భారత జట్టులో నైపుణ్యాలకు కొరత లేదని, సరైన విధానమే లోపించిందని వాన్ అన్నాడు. ‘‘ఎవరూ కూడా వారిని (భారత్ ను) విమర్శించాలని అనుకోరు. ఎందుకంటే సోషల్ మీడియాలో వారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్లేషకులు, క్రికెట్ పండితులు అయితే భారత్ జట్టుతో కలసి పనిచేసే అవకాశం కోల్పోతామన్న భయం వారిని మాట్లాడనీయదు. వారి బౌలింగ్ ఆప్షన్లు కొన్నే. బ్యాటింగ్ లైన్ కూడా లోతుగా ఉండదు. స్పిన్ ట్రిక్స్ కూడా లోపించాయి’’ అని వాన్ పేర్కొన్నాడు.