Congress: గుజరాత్ ఎన్నికల్లో దూకుడు పెంచిన కాంగ్రెస్.. అభ్యర్థుల రెండో జాబితా విడుదల
- 46 మంది అభ్యర్థులతో రెండో జాబితా
- తొలి దశలో 43 మందికి టికెట్ల ఖరారు
- వచ్చే నెల 1, 5వ తేదీల్లో పోలింగ్
గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ ఎన్నికల్లో వివిధ స్థానాలకు 46 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ నెల నవంబర్ 4న పార్టీ తొలి జాబితాను వెల్లడించింది. అందులో 43 మంది అభ్యర్థులను ప్రకటించింది.
తాజాగా రెండో జాబితాతో 182 సీట్లకు గాను ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 89కి చేరుకుంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ సంతకం చేసిన అభ్యర్థుల జాబితాలో మమద్‌భాయ్ జంగ్ జాట్ (అబ్దాసా నియోజకవర్గం), రాజేందర్‌సింగ్ జడేజా (మాండ్వీ), అర్జన్‌భాయ్ భూడియా (భుజ్), నౌషాద్ సోలంకి (దసాదా - ఎస్సీ), కల్పనా కరంసిభాయ్ మక్వానా (లింబ్డీ) వంటి ప్రముఖులు ఉన్నారు. ముగ్గురు మహిళా నేతలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
మరోవైపు బీజేపీ ఒకేసారి 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా చాలా మంది ప్రముఖులకు అధికార పార్టీ టికెట్లు ఇవ్వలేదు. పలువురు కొత్త వారికి అవకాశం కల్పించింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించింది.