YS Sharmila: తెలంగాణలో టీడీపీ బలం పుంజుకుంటుందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై షర్మిల స్పందన
- తెలంగాణ ఏమైనా కేసీఆర్ అబ్బ సొత్తా? అని ప్రశ్నించిన షర్మిల
- ఎవరైనా రావొచ్చని, ప్రజల మనసులు గెలుచుకోవచ్చని వ్యాఖ్య
- మోదీని కలిసే దమ్ము కూడా కేసీఆర్ కు లేదా? అని ఎద్దేవా
తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపై పుట్టిందని... తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ అబ్బ సొత్తా? అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణకు ఎవరైనా రావచ్చని... ప్రజల మనసులను గెలుచుకోవచ్చని చంద్రబాబు వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుంటే ఆయనను కలిసే దమ్ము కూడా కేసీఆర్ కు లేదా? అని ప్రశ్నించారు. ప్రధానిని కలిసి ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ఒత్తిడి చేయాల్సిన ముఖ్యమంత్రి... దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం లేదని షర్మిల అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు. సొంత ఆస్తులను పెంచుకోవడానికే కేసీఆర్ పథకాలను ప్రారంభిస్తున్నారని... వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు.