Tollywood: బన్నీ మంచి మనసుపై కేరళ కలెక్టర్ ప్రశంసల వర్షం
- కేరళలో పేద యువతి చదువుకు ఆర్థిక సాయం చేయాలని కోరిన ఐఏఎస్ అధికారి వీఆర్ కృష్ణ తేజ
- వెంటనే స్పందించి యువతి నర్సింగ్ విద్యకు స్పాన్సర్ చేసిన అల్లు అర్జున్
- ఒక ఏడాది ఖర్చు అడిగితే నాలుగేళ్ల ఖర్చులు తానే భరిస్తానని భరోసా
రీల్ లైఫ్ హీరోలందరూ నిజ జీవితంలో కూడా హీరోలు కాలేరు. కానీ, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మంచి మనసుతో నిజ జీవితంలో కూడా హీరో అయ్యారు. నర్సింగ్ విద్య పూర్తి చేసేందుకు ఇబ్బంది పడుతున్న కేరళకు చెందిన ఓ విద్యార్థినికి సాయం చేసేందుకు బన్నీ ముందుకొచ్చాడు. తెలుగు వారైన ఆ జిల్లా కలెక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఆ విద్యార్థి నాలుగేళ్ల చదువుకు అయ్యే అన్ని ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని అలప్పుజా జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. బన్నీ సేవాగుణంపై ఆయన ప్రశంసలు కరిపించారు.
చదువులో ఎంతో చురుగ్గా ఉన్న ఓ ముస్లిం యువతి నర్సింగ్ విద్యను అభ్యసించేందుకు సాయం కోరుతూ తన దగ్గరకు వచ్చిందని కలెక్టర్ చెప్పారు. ఇంటర్ లో ఆమె 92 శాతం మార్కులు సాధించిందని, కానీ, గత సంవత్సరం కరోనాతో ఆమె తండ్రి మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై చదువు కొనసాగించలేక పోయిందన్నారు. తమ వంతుగా ఆమెకు కొంత సహకారం అందించామని చెప్పారు. ఓ ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ ఇప్పించామన్నారు.
కానీ, నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసేందుకు ఆమెకు ఆర్థిక సహాయం కూడా అవసరం కావడంతో తాను అల్లు అర్జున్‌ను సంప్రదించానని, అందుకు ఆయన వెంటనే అంగీకరించారని తెలిపారు. ఒక ఏడాది స్పాన్సర్ చేయమని కోరగా, హాస్టల్ ఫీజుతో సహా మొత్తం చదువుల ఖర్చును నాలుగేళ్ల పాటు తానే ఇస్తానని భరోసా ఇచ్చారని వెల్లడించారు. బన్నీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.