- టీ20 మ్యాచ్ లకు సారథిగా పాండ్యా
- వన్డే మ్యాచ్ లకు కెప్టెన్ గా శిఖర్ ధావన్
- రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్, అశ్విన్ కు విరామం
- హెడ్ కోచ్ గా లక్ష్మణ్ సేవలు
టీ20 ప్రపంచకప్ లో వైఫల్యం నేపథ్యంలో.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత్ జట్టు పరంగా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కోచ్ రాహుల్ ద్రవిడ్ ను పక్కన పెట్టనున్నారు. అంతేకాదు, కెప్టెన్ గా రాణించలేకపోతున్న రోహిత్ శర్మకు విరామం ఇవ్వనున్నారు. టీ20 ప్రపంచకప్ లో నిరాశపరిచిన కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించనున్నారు.
ఇక రాహుల్ ద్రవిడ్ స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ) చీఫ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్, న్యూజిలాండ్ టూర్ కు టీమిండియా హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. బ్యాటింగ్ కోచ్ గా హృషికేష్ కనిత్కర్, బౌలింగ్ కోచ్ గా సాయిరాజ్ బహుతులే సేవలు అందించనున్నారు. ఈ వివరాలను బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. లక్షణ్ హెడ్ కోచ్ గా పని చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది జింబాబ్వే టూర్ కు సైతం కోచ్ గా సేవలు అందించాడు. అలాగే, ఐర్లాండ్ పర్యటన సమయంలో, ఇటీవల దక్షిణాఫ్రికా భారత్ పర్యటనలోనూ కోచ్ గా పనిచేశాడు.
న్యూజిలాండ్ టూర్ లో పాండ్యా, శిఖర్ ధావన్ కెప్టెన్సీ సేవలు అందించనున్నారు. వెల్లింగ్టన్ లో నవంబర్ 18, ముంగానీలో 20న, నేపియర్ లో 22న జరిగే టీ20 మ్యాచ్ లకు పాండ్యా సారథిగా వ్యవహరిస్తాడు. ఆక్లాండ్ లో 25న, హమిల్టన్ లో 27న, క్రిస్ట్ చర్చ్ లో 30న జరిగే వన్డే మ్యాచ్ లకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఇక డిసెంబర్ 4న మొదలయ్యే బంగ్లాదేశ్ టూర్ కు మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడు. కోహ్లీ, అశ్విన్ కూడా వచ్చి చేరనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.