Gudivada Amarnath: విశాఖలో ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీకి పెద్దగా ప్రాధాన్యం లేదు: మంత్రి అమర్నాథ్
- ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ
- ఈ సాయంత్రం విశాఖ రాక
- ప్రధానిని కలవనున్న పవన్ కల్యాణ్
- అసలిది చర్చనీయాంశమే కాదన్న మంత్రి అమర్నాథ్
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీ పర్యటనకు వస్తున్నారు. మోదీ ఈ రాత్రికి విశాఖపట్నంలోని నేవీ అతిథి గృహం 'చోళ సూట్' లో బస చేయనున్నారు. కాగా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీకి ఏమంత ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశాన్ని పెద్దదిగా చూడాల్సిన అవసరంలేదని, అసలు చర్చనీయాంశమే కాదని తీసిపారేశారు. రాజకీయ పరంగా చూస్తే ఏపీలో జనసేన, బీజేపీలకు ఓట్లు లేవు, సీట్లు లేవు అని విమర్శించారు.
విశాఖలో ప్రధాని మోదీ పాల్గొంటున్నది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఆయనకు గవర్నర్, సీఎం స్వాగతం పలుకుతారని వెల్లడించారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా రూ.15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి వివరించారు.
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టులు, ప్యాకేజీలు కాకుండా, పవన్ కల్యాణ్ ఇకనైనా సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలని హితవు పలికారు. విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదని భావిస్తున్న చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసి నడుస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ లోకి టీడీపీని కూడా తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.