AP High Court: అమరావతి మాస్టర్ ప్లాన్ సవరణలపై గ్రామసభలు నిర్వహించండి... ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలు
- కొత్తగా ఆర్-5 జోన్ ఏర్పాటు
- రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్
- ఇటీవల నోటిఫికేషన్ జారీ
- గ్రామసభలు నిర్వహించకుండా నోటీసులు ఇచ్చారన్న రైతులు
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి మాస్టర్ ప్లాన్ లో సవరణలపై రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రామ సభలు నిర్వహించకుండా తమకు నోటీసులు ఇవ్వడం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వాదనలు విన్న న్యాయస్థానం... మాస్టర్ ప్లాన్ సవరణలపై అమరావతి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిలోని 17 గ్రామాల్లో రెండ్రోజుల వ్యవధిలో గ్రామసభలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించగా, మిగతా గ్రామాల్లోనూ గ్రామసభలు జరపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి మాస్టర్ ప్లాన్ లో మార్పులకు ఏపీ సర్కారు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా ఆర్-5 అనే జోన్ ను ఏర్పాటు చేస్తూ ఈ నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది. ఈ జోన్ ఏర్పాటు కోసం సీఆర్డీయే చట్ట సవరణ చేస్తున్నట్టు పేర్కొంది.
ఐదు గ్రామాల పరిధిలోని తొమ్మిది వందల ఎకరాలను ఈ ఆర్-5 జోన్ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.... దీనిపై అభ్యంతరాలను 15 రోజుల్లో సీఆర్డీయేకి తెలియజేయాలని పేర్కొంది. అయితే, రైతులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామసభలు జరపకుండానే తమకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చారంటూ హైకోర్టును ఆశ్రయించారు. రైతుల అభ్యంతరాలపై విచారణ జరిపిన న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు ఇచ్చింది.