Narendra Modi: అంతరిక్షం నుంచి సముద్రగర్భం వరకు ప్రతి అవకాశాన్ని పట్టుకుంటాం: విశాఖలో మోదీ

Modi speech in Vizag

  • రూ. 10,742 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసిన మోదీ
  • వెయ్యేళ్ల క్రితమే విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేదన్న ప్రధాని
  • వెంకయ్యనాయుడు ఎప్పుడు కలిసినా ఏపీ శ్రేయస్సు గురించే మాట్లాడేవారని కితాబు

మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నానని... ఇప్పుడు మరోసారి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగిందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ప్రియమైన సోదర సోదరీమణులారా' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకు ముందు రూ. 10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.  

భారత్ కు విశాఖ ఎంతో ప్రత్యేకమైన నగరమని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనదని... వెయ్యేళ్ల క్రితమే ఇక్కడి నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేదని అన్నారు. ఈరోజు కూడా విశాఖ ప్రముఖ వ్యాపార కేంద్రమని చెప్పారు. తాను ఈరోజు ప్రారంభిస్తున్న ప్రాజెక్టులతో విశాఖతో పాటు, ఏపీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

ఏపీ ప్రజలు మంచి వారని, స్నేహ స్వభావం కలిగిన వారని ప్రధాని కొనియాడారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎప్పుడు తనను కలిసినా ఏపీ శ్రేయస్సు, ప్రయోజనాల గురించే మాట్లాడేవారని చెప్పారు. ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని కితాబునిచ్చారు. ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారని చెప్పారు. తెలుగు భాష ఉన్నతమయినదని కొనియాడారు. 

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని మోదీ తెలిపారు. విశాఖలో చేపల రేవును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. మన దేశంలో రవాణా వ్యవస్థలో పలు మార్పులు వచ్చాయని తెలిపారు. భారత్ అనేక సవాళ్లను అధిగమించిందని... ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రశంసలు పొందుతోందని, భారత్ కు పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. జీఎస్టీ, గతి శక్తి వంటి వాటి వల్ల పేదల సంక్షేమం మరింత మెరుగుపడుతోందని అన్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు వేస్తున్నామని చెప్పారు. పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇస్తున్నామని తెలిపారు. 

రైల్వే స్టేషన్లు, పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. ఈరోజు ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోందని... సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం భారత్ వైపు చూస్తోందని అన్నారు  ప్రజల కోసం డ్రోన్ల నుంచి గేమింగ్ వరకు... అంతరిక్షం నుంచి స్టార్టప్ ల వరకు అనేక పథకాలు పని చేస్తున్నాయని చెప్పారు. అంతరిక్షం నుంచి సముద్రగర్భం వరకు ప్రతి అవకాశాన్ని పట్టుకుంటామని అన్నారు. 'భారత్ మాతాకీ జై' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News