Pakistan: పాక్ టీ20 కప్ గెలిస్తే.. 2048లో పాకిస్థాన్ ప్రధానిగా బాబర్ అజామ్: సునీల్ గవాస్కర్
- 1992లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ ను గెలిచిన పాక్
- 2018లో పాక్ ప్రధాని అయిన ఇమ్రాన్
- ఇప్పుడు పాక్ ను అజామ్ గెలిపిస్తే ప్రధాని కావొచ్చన్న సరదా విశ్లేషణ
పాకిస్థాన్ జట్టు ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి కప్పు గెలుస్తుందా..? ఇప్పుడు దీనిపైనే సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. దీనిపై సీనియర్ క్రీడాకారులు సైతం తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫైనల్స్ లో ఇంగ్లండ్ జట్టును పాకిస్థాన్ జట్టు ఓడించి కప్ గెలిస్తే, ఆ దేశానికి బాబర్ అజామ్ 2048లో ప్రధాని అవుతాడంటూ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆదివారం పాకిస్థాన్-ఇంగ్లండ్ తలపడనున్నాయి.
1992లో ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి వన్డే ప్రపంచకప్ ను ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు గెలుచుకుంది. ఆ తర్వాత 2018 ఆగస్ట్ లో పాకిస్థాన్ కు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఎన్నిక కావడం తెలిసిందే. అంటే ప్రపంచకప్ గెలుచుకున్న 26 ఏళ్లకు ప్రధాని పదవిని అలంకరించారు. అదే మాదిరి ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అదే ఇంగ్లండ్ జట్టుపై పాక్ గెలిస్తే, సరిగ్గా 26 ఏళ్ల తర్వాత 2048లో బాబర్ అజామ్ పాక్ పీఎం అవుతాడన్నది గవాస్కర్ విశ్లేషణ.
నెట్ ప్రపంచంలో ఇప్పుడు దీనిపైనే పెద్ద జోకులు, చర్చలు నడుస్తున్నాయి. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, నాటి వన్డే ప్రపంచకప్ కు, నేటి టీ20 ప్రపంచకప్ కు మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. ట్రోఫీ గెలిచేందుకు తాము నూరు శాతం కష్టపడతామని ప్రకటించడం గమనార్హం.