Babar Azam: ఒత్తిడి కంటే ఉద్విగ్నత ఎక్కువగా ఉంది... ఫైనల్ మ్యాచ్ పై పాక్ కెప్టెన్ స్పందన
- రేపు వరల్డ్ కప్ ఫైనల్
- ఇంగ్లండ్ తో పాక్ అమీతుమీ
- మీడియాతో మాట్లాడిన బాబర్ అజామ్
- గత మూడు మ్యాచ్ ల్లో రాణించామని వెల్లడి
- తమ ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరణ
టీ20 వరల్డ్ కప్ టైటిల్ కోసం పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు రేపు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెల్బోర్న్ లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మీడియాతో మాట్లాడాడు.
ఫైనల్ మ్యాచ్ అయినప్పటికీ తనపై ఒత్తిడి కంటే ఉద్విగ్నత ఎక్కువ ప్రభావం చూపుతోందని, రేపటి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. గత మూడు మ్యాచ్ లలో తాము మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో జట్టు పరంగా తమ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వెల్లడించాడు.
"టైటిల్ విజేతను నిర్ణయించే మ్యాచ్ కావడంతో ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసంతోనే ఈ ఒత్తిడిని అధిగమించగలం. మ్యాచ్ లో గెలవాలంటే ప్రతి ఆటగాడు తనపై తాను నమ్మకం ఉంచాలి" అని బాబర్ పేర్కొన్నాడు.
అటు, ఇంగ్లండ్ జట్టుపై స్పందిస్తూ, ఇంగ్లండ్ పోరాటతత్వం ఉన్న జట్టు అని, సెమీస్ లో భారత్ పై వారు నెగ్గిన తీరే అందుకు రుజువు అని బాబర్ కితాబునిచ్చాడు. తమ బలం పేస్ బౌలింగేనని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించి ఫైనల్లో నెగ్గేందుకు ప్రయత్నిస్తామని బాబర్ వెల్లడించాడు.
ఏదేమైనా ఈ టోర్నీలో పెద్దగా అవకాశాలు లేని స్థితి ఉంచి ఫైనల్ చేరడం ఓ కలలా ఉందని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ జట్టు రేపటి ఫైనల్లో ఆడుతోందంటే అది దైవనిర్ణయమేనని అభిప్రాయపడ్డాడు. తాము ఎప్పట్లానే విజయం కోసం తీవ్రంగా శ్రమించడం మాత్రం ఆపబోమని స్పష్టం చేశాడు.