BCCI: ఐసీసీలోకి అడుగుపెట్టిన జై షా..వివరాలివిగో
- బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగుతున్న జై షా
- తాజాగా ఐసీసీ ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ ఎఫైర్స్ కమిటీ చీఫ్ గా నియామకం
- జై షాకు అభినందనలు తెలిపిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శిగా పనిచేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా,.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లోకి అడుగు పెట్టారు. ఐసీసీలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను పర్యవేక్షించే కమిటీకి ఆయన నేతృత్వం వహించనున్నారు. ఐసీసీ ఫైనాన్షియల్ అండ్ కమర్షియల్ ఎఫైర్స్ కమిటీ చీఫ్ గా ఆయన నియమితులయ్యారు.
ఈ మేరకు పీటీఐను ఉటంకిస్తూ పలు వార్తా సంస్థలు జై షా నూతన నియామకానికి సంబంధించి వార్తలు ప్రచురించాయి. అదే సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బీజేపీ నేత హర్ష్ సంఘ్వీ.. ఐసీసీ పదవిలో నియమితులైన జై షాకు అభినందనలు కూడా తెలియజేశారు. ఐసీసీలో జై షా త్వరలోనే కీలక పదవి చేపట్టబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీలో కీలక విభాగమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీకి చీఫ్ గా ఆయన నియమితులు కావడం గమనార్హం.