Pawan Kalyan: నా చొక్కా పట్టుకునే దమ్ము వైసీపీ నేతలకు ఉందా?: పవన్ కల్యాణ్
- విజయనగరం జిల్లాలో పవన్ పర్యటన
- గుంకలాంలో జగనన్న కాలనీ ఇళ్ల సందర్శన
- ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలన్న జనసేనాని
- వైసీపీ నేతలను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని పిలుపు
జనసేన పార్టీ అధినేత విజయనగరం జిల్లా గుంకలాంలో జగనన్న కాలనీ ఇళ్లు పరిశీలించిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైసీపీ అవినీతికి చిరునామాగా మారిందని విమర్శించారు. జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.12 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఏనాడైనా ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ పట్టించుకుందా? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ఏంచేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, వైసీపీ నేతలను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, అయితే తాను ఢిల్లీ వెళ్లనని ఎక్కడి సమస్యను అక్కడే తేలుస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నా చొక్కా పట్టుకునే దమ్ము వైసీపీ నేతలకు ఉందా? అని సవాల్ విసిరారు.
జనసేన అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంటే తాను చూపిస్తానని స్పష్టం చేశారు. ప్రజల కోసం జనసేన పార్టీ ఏర్పాటు చేశామని అన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని, అయినా తాను వెనుకంజ వేయబోనని తెలిపారు.
తాను మిగతా హీరోల్లా ఎందుకు వాణిజ్య ప్రకటనల్లో నటించడో కూడా పవన్ వెల్లడించారు. యువత పక్కదారిపడుతుందన్న ఉద్దేశంతోనే యాడ్స్ చేయనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ నామినేషన్లను అడ్డుకుంటే కాళ్లు చేతులు విరగ్గొట్టడం ఖాయమని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.