Sunil Gavaskar: అయినా.. ఇంగ్లండే గెలిచేది: గవాస్కర్

Gavaskars bold statement on Shaheen after ENG vs PAK T20 WC final
  • షహీన్ అఫ్రిది గాయపడకుండా ఉంటే గెలిచేవాళ్లమన్న బాబర్
  • షహీన్ ఉన్నా పాక్ ఓడేదన్న సునీల్ గవాస్కర్
  • మహా అయితే మరో వికెట్ దక్కి ఉండేదని వ్యాఖ్య
పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్థాన్ నిర్దేశించిన స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను పాక్ బౌలర్లు తొలుత ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత పుంజుకున్న ఇంగ్లండ్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్ కీలక ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్ని అందించిపెట్టింది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది గాయపడకుండా ఉంటే విజయం సాధించేవాళ్లమని అన్నాడు. 

పాక్ స్కిప్పర్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. అంత సీన్ లేదని తేల్చి చెప్పాడు. షహీన్ అఫ్రిది గాయపడకుండా ఉంటే తన కోటా మిగతా రెండు ఓవర్లు వేసేవాడని, మహా అయితే పాకిస్థాన్‌కు మరో వికెట్ దక్కి ఉండేదని అన్నాడు. అంతే తప్ప ఇంగ్లండ్ గెలుపును అడ్డుకోవడం సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డాడు. షహీన్ అఫ్రిది గాయపడకున్నా పాక్ ఓటమి పాలయ్యేదని తేల్చి చెప్పాడు. 

ఇంతకీ ఏమైందంటే.. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ క్యాచ్ పడుతూ గాయపడిన షహీన్ అఫ్రిది మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత 16వ ఓవర్‌లో తిరిగి మైదానంలోకి వచ్చాడు. అప్పటికే రెండు ఓవర్లు వేసి 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మైదానంలోకి తిరిగి వచ్చాక మరో ఓవర్ వేసేందుకు ప్రయత్నించినప్పటికీ గాయం కారణంగా సాధ్యం కాలేదు. ఒక్క బంతి మాత్రమే వేయగలిగాడు. దీంతో మిగతా ఐదు బంతులను ఇఫ్లికార్ అహ్మద్‌తో వేయించి కోటాను పూర్తి చేశారు.

షహీన్ తన కోటా ఓవర్లను పూర్తి చేయకపోవడం వల్లే పాకిస్థాన్ ఓడిందన్న బాబర్ ఆజం వ్యాఖ్యలను కొట్టిపడేసిన గవాస్కర్.. అప్పటికి ఇంగ్లండ్ సాధించాల్సినవి మరో 15-20 పరుగులేనని గుర్తు చేశాడు. ఒకవేళ స్కోరు 150-155 పరుగులైతే కనుక అప్పుడు బౌలర్లకు చాన్స్ ఉండేదని అభిప్రాయపడ్డాడు. కాబట్టి షహీన్ మరో 10 బంతులు వేయడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండేది కాదని చెప్పుకొచ్చాడు. మహా అయితే పాకిస్థాన్‌కు మరో వికెట్ దక్కి ఉండేదని పేర్కొన్నాడు.
Sunil Gavaskar
Babar Azam
Saheen Shah Afridi
T20 World Cup

More Telugu News