aiims: 18 నెలల పాప అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ!
- ఇంట్లో ఆడుకుంటూ బాల్కనీ నుంచి పడిపోయిన మహీరా
- మహీరాను బ్రెయిన్ డెడ్ గా తేల్చిన ఎయిమ్స్ వైద్యులు
- పాప తల్లిదండ్రుల అనుమతితో అవయవదానం
ఏడాదిన్నర వయసులోనే ఓ పాప ఈ ప్రపంచాన్ని వీడిపోతూ మరో ఇద్దరి ప్రాణాలను నిలబెట్టింది.. కన్నతల్లిదండ్రులకు శోకం మిగిల్చినా, రెండు కుటుంబాల్లో దేవతగా మారింది. ఓవైపు బిడ్డ దక్కదనే బాధను మోస్తూనే తోటివారికి తమలాంటి పరిస్థితి రాకూడదని కూతురు అవయవదానానికి ఒప్పుకున్నారా తల్లిదండ్రులు.
హర్యాణాలోని మేవాత్ కు చెందిన ఆ పాప పేరు మహీరా. వయసు 18 నెలలు. ఈ నెల 6వ తేదీన ఇంట్లో పడిపోయింది. ఆడుకుంటూ బాల్కనీ నుంచి కిందపడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పాప తల్లిదండ్రులు మహీరాను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకెళ్లారు.
ఎయిమ్స్ వైద్యులు ఆ పాపను పరీక్షించి, చికిత్స మొదలు పెట్టారు. రోజులు గడిచినా ఉపయోగంలేకుండా పోవడంతో మరోసారి పరీక్షించి ఈ నెల 11న మహీరాను బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఆసుపత్రిలోని యంత్రాల సాయంతో ఊపిరి అందించవచ్చు కానీ బిడ్డలో చలనం ఉండదని, బతికే అవకాశంలేదని మహీరా తల్లిదండ్రులకు వివరించారు. అవయవదానంపై వారికి అవగాహన కల్పించి, మహీరా అవయవాలతో కొందరి ప్రాణాలు నిలబెట్టవచ్చని చెప్పారు. దీంతో అవయవదానానికి పాప తల్లిదండ్రులు అంగీకారం తెలిపారు.
మహీరా కాలేయాన్ని ఆరు నెలల చిన్నారికి, కిడ్నీలేమో ఓ పదిహేడేళ్ల అబ్బాయికి అమర్చినట్లు ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. దీంతో వాళ్లిద్దరికీ పునర్జన్మ లభించినట్టయిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కిడ్నీల కోసం ఆ యువకుడు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కాగా, దేశంలో అవయవదానం చేసిన అతిపిన్న వయస్కులలో మహీరా రెండవ పాప అని వైద్యులు చెప్పారు.