Krishna: సూపర్ స్టార్ కృష్ణకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైన కృష్ణ
- హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలింపు
- ఆసుపత్రిలో మహేశ్ బాబు, నరేశ్, ఇతర కుటుంబసభ్యులు
సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో, ఆయనను హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్తతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సినీ ప్రముఖులు కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం కృష్ణ నానక్ రామ్ గూడలో నరేశ్ వద్ద ఉంటున్నారు. ఇదే ఇంట్లో విజయనిర్మలతో కలసి కృష్ణ ఉండేవారు. అప్పుడప్పుడు మహేశ్ బాబు తన తండ్రి వద్దకు వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కృష్ణ కుమారుడు మహేశ్ బాబు, ఆయన కుమార్తెలు, నరేశ్ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవలే ఆయన భార్య కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఆయన కుమారుడు రమేశ్ బాబు మరణించారు. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అంతకు ముందు ఆయన రెండో భార్య విజయనిర్మల కన్నుమూశారు. కృష్ణ వయసు 79 సంవత్సరాలు.