RBI: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలంటే.. ఆర్బీఐ కొత్త రూల్
- కొన్ని షరతులతో బ్యాంకులో మార్చుకోవచ్చట
- చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదంటున్న ఆర్బీఐ
- విత్ డ్రా స్లిప్పును జతచేయడం తప్పనిసరని సూచన
- గరిష్ఠంగా 20 నోట్ల దాకా మార్చుకోవచ్చని వివరణ
ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసినప్పుడు చిరిగిన నోట్లు వస్తే ఆందోళన తప్పదు.. పెద్ద నోటు అయితే టెన్షన్ మామూలుగా ఉండదు. మార్కెట్ లో దానిని మార్చుకోలేక, బ్యాంకుకు వెళ్తే కొంత మొత్తం చార్జీల రూపంలో వదులుకోవాల్సి వస్తుందని ఆందోళన పడుతుంటారు. ఎవరో చేసిన దానికి ప్రతిఫలం చెల్లించాల్సి వచ్చిందేంటా అని వాపోతుంటారు. ఇకపై ఇలాంటి టెన్షన్స్ అక్కర్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పేర్కొంది. ఏటీఎం విత్ డ్రా స్లిప్పును జతచేస్తూ బ్యాంకుకు ఓ దరఖాస్తు రాసి చినిగిన నోట్లను మార్చుకోవచ్చని చెబుతోంది. అయినప్పటికీ నోట్లను మార్చేందుకు బ్యాంకు నిరాకరిస్తే.. ఆ బ్యాంకుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బ్యాంకు ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే సదరు బ్యాంకుదే బాధ్యత అని ఆర్బీఐ తేల్చిచెప్పింది. ఏటీఎంలో నగదు పెట్టేటపుడే నోట్లను సరిచూసుకోవాలని సూచించింది. ఏటీఎంలో వచ్చిన చిరిగిన నోట్లను మార్చేందుకు ఒప్పుకోకుంటే సదరు బ్యాంకుకు రూ.పదివేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇక, కరెన్సీ నోటుపై సీరియల్ నంబర్ లేకపోయినా, మహాత్మా గాంధీ వాటర్ మార్క్, గవర్నర్ సంతకం కనిపించకపోయినా.. అది నకిలీ నోటుగా గుర్తించాలని, బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలని ఆర్బీఐ పేర్కొంది.
అయితే, చిరిగిన, నకిలీ నోట్లను మార్చుకోవడానికి ఏ ఏటీఎంలో, ఎప్పుడు విత్ డ్రా చేశారనే వివరాలను పేర్కొంటూ దరఖాస్తు పెట్టుకోవాలి. ఏటీఎంలో నుంచి ఆ నోట్లు వచ్చాయనేందుకు ఆధారంగా విత్ డ్రా స్లిప్పును ఆ దరఖాస్తుకు జతచేయాలని ఆర్బీఐ సూచించింది. ఒక్క వ్యక్తి గరిష్ఠంగా 20 నోట్ల(వాటి విలువ 5 వేల లోపుండాలి)ను మార్చుకోవచ్చని తెలిపింది.