BJP: నడిరోడ్డుపై బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే... ఆటోలో కోర్టుకు వెళ్లాను: ఎమ్మెల్యే రాజా సింగ్
- ఉగ్రవాదుల నుంచి రాజా సింగ్ కు ముప్పు
- కేంద్ర ఇంటెలిజెన్స్ ఆదేశాలతో బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖ
- ఆ వాహనానికి నిత్యం రిపేర్లు వస్తున్నాయన్న రాజా సింగ్
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు పోలీసులు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల నుంచి ప్రాణహాని ఉన్న తనకు నిత్యం రిపేర్లతో సతమతం చేసే బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనకు పొంచి ఉన్న ముప్పుపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదేశాలు జారీ చేస్తే ... రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ కారును అమర్చారని ఆయన అన్నారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు నిత్యం రిపేర్లకు గురి అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తనను ఎన్ని సార్లు ఇబ్బంది పెట్టిందన్న విషయాన్ని కూడా రాజా సింగ్ వెల్లడించారు. 4 నెలల క్రితం నడిరోడ్డులోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే... దానిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించానని ఆయన అన్నారు. ఈ క్రమంలో మంచి కండిషన్ లో ఉన్న వాహనాన్ని పంపడానికి బదులుగా పోలీసులు నిలిచిపోయిన వాహనానికి రిపేర్లు చేసి పంపారన్నారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు వెళుతుండగా... రోడ్డుపైనే వాహనం ఆగిపోగా...గన్ మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లానన్నారు. ఇటీవలే అప్జల్ గంజ్ లోనూ ఆ వాహనం ఆగిపోగా...ఇంటి నుంచి సొంత వాహనాన్ని రప్పించుకోవాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు.