BJP: రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం రమేశ్
- ఇటీవలే రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన సీఎం రమేశ్
- పార్లమెంటులో బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఎంపీ
- ఢిల్లీలో ఎంపీల వసతి సౌకర్యాలను పర్యవేక్షించనున్న తెలుగు నేత
తెలుగు నేలకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సోమవారం కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం రమేశ్... 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన సీఎం రమేశ్... వరుసగా పదేళ్లకు పైగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో సోమవారం పార్లమెంటులో ఆయన రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయనకు హౌస్ కమిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన రమేశ్... కమిటీకి చెందిన కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు. రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ హోదాలో ఢిల్లీలో ఎంపీలకు సర్కారీ బంగళాల కేటాయింపు, వాటి నిర్వహణ తదితర బాధ్యతలను రమేశ్ పర్యవేక్షించనున్నారు.