Michael Vaughan: క్రికెట్ బోర్డును ఎలా నడపాలో బీసీసీఐకి ఉచిత సలహాలు ఇచ్చిన మైఖేల్ వాన్
- టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ ఓటమి
- ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం
- ఇంగ్లండ్ జట్టును చూసి స్ఫూర్తి పొందాలని బీసీసీఐకి సూచన
- భారత్, పాక్ లను ఇంగ్లండ్ స్మార్ట్ గా ఓడించిందని కితాబు
భారత క్రికెట్ జట్టు అన్నా, ఐపీఎల్ లీగ్ అన్నా ఎంతో తేలికభావంతో మాట్లాడే ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలవడంపై స్పందించాడు. క్రికెట్ బోర్డును ఎలా నడపాలో బీసీసీఐకి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు.
"నేనే గనుక బీసీసీఐని నడిపిస్తుంటే పరువుప్రతిష్ఠలను పక్కనబెట్టి ఇంగ్లండ్ జట్టును స్ఫూర్తిగా తీసుకుంటాను" అని వ్యాఖ్యానించాడు. తద్వారా ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు అందనంత ఎత్తులో ఉందనేలా స్పందించాడు.
"ఇంగ్లండ్ జట్టు గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ముందు వరుసలో ఉంది. అందుకు ఇంగ్లండ్ క్రికెట్ అనుసరించిన విధానాలే కారణం. యువ క్రికెటర్లు పెద్ద సంఖ్యలో వెలుగులోకి రావడమే కాదు, మ్యాచ్ విన్నర్లుగా ఎదుగుతున్నారు. తద్వారా అనేకమంది ప్రతిభావంతులతో ఇంగ్లండ్ క్రికెట్ బలోపేతం అయింది" అని పేర్కొన్నాడు. బీసీసీఐ కూడా ఇంగ్లండ్ బోర్డును చూసి నేర్చుకోవాలని తెలిపాడు.
ఇక, సెమీఫైనల్లో భారత్ ను, ఫైనల్లో పాకిస్థాన్ ను ఇంగ్లండ్ చాలా స్మార్ట్ గా ఓడించిందని మైఖేల్ వాన్ వివరించాడు. ఇంగ్లండ్ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వాళ్లు అనుసరించిన వ్యూహాలు ఎంతో బాగున్నాయని కితాబునిచ్చాడు. కీలకమైన మ్యాచ్ ల కోసం డేటాను సమర్థంగా వినియోగించుకున్నారని అభినందించాడు.
ముఖ్యంగా సెమీస్ లో టీమిండియాను ఓడించడం సర్వోన్నతమైన ప్రదర్శన అని వాన్ ఇంగ్లండ్ జట్టును కొనియాడాడు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకోవడం అనేది తెగువతో కూడిన నిర్ణయం అని, విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని ఆదిల్ రషీద్ కు కాస్త ముందే బౌలింగ్ అప్పగించడం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నాడు.
రిషబ్ పంత్ బ్యాటింగ్ కు వచ్చేసరికి ఆదిల్ రషీద్ కు ఓవర్లు పూర్తయ్యేలా ఇంగ్లండ్ వ్యూహకర్తలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రశంసించాడు. పాకిస్థాన్ పైనా ఆదిల్ రషీద్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి ఆశించిన ఫలితాన్ని అందుకున్నాడని వాన్ తెలిపాడు. ఈ మేరకు 'ది టెలిగ్రాఫ్ యూకే' మీడియా సంస్థకు రాసిన తన వ్యాసంలో పేర్కొన్నాడు.