Krishna: కృష్ణకి .. శోభన్ బాబుకి అది ఒక మరపురాని జ్ఞాపకం!
- కృష్ణకంటే ముందుగా ఇండస్ట్రీకి వచ్చిన శోభన్ బాబు
- ముందుగా స్టార్ డమ్ ను అందుకున్న కృష్ణ
- ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం
- మల్టీ స్టారర్స్ తోను ఎక్కువ హిట్లు కొట్టిన హీరోలు
తెలుగు తెరపై ఎన్టీఆర్ - ఏఎన్నార్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ పౌరాణికాలతో విజృంభిస్తూ ఉంటే, ఏఎన్నార్ రొమాంటిక్ సినిమాల్లో చెలరేగిపోయేవారు. ఇద్దరూ కలిసి భారీ మల్టీస్టారర్ సినిమాలు కూడా చేసేవారు. ఇద్దరి సినిమాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఒకే సమయంలో ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత తరం హీరోలుగా కృష్ణ - శోభన్ బాబు తమ జోరును చూపించారు.
కృష్ణ - శోభన్ బాబు ఇద్దరూ కూడా నవలా నాయకుల మాదిరిగా మంచి హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో కనిపించేవారు. కృష్ణకంటే ముందుగానే శోభన్ బాబు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, కృష్ణకే ముందుగా స్టార్ డమ్ వచ్చింది. కృష్ణ తన మూడో సినిమా అయిన 'మోసగాళ్లకు మోసగాడు'తో స్టార్ హీరో అయ్యారు. అదే స్టార్ డమ్ ను శోభన్ బాబు సంపాదించుకోవడానికి పదేళ్లు పట్టింది. అయితే ఇద్దరి మధ్య మంచి స్నేహభావం ఉండేది. ఈ కారణంగానే ఇద్దరూ కలిసి అనేక మల్టీ స్టారర్ సినిమాలు చేశారు.
కృష్ణ - శోభన్ బాబు కలిసి నటించిన సినిమాలలో, ముందడుగు .. మండే గుండెలు .. మహా సంగ్రామం .. గంగ మంగ .. కృష్ణార్జునులు .. కురుక్షేత్రం సినిమాలు కనిపిస్తాయి. 'కురుక్షేత్రం' సినిమాలో కృష్ణుడిగా శోభన్ బాబు, అర్జునుడిగా కృష్ణ నటించారు. ఈ సినిమాలో కృష్ణార్జునులుగా తాము ఉన్న పోస్టర్ అంటే ఇటు కృష్ణకి .. అటు శోభన్ బాబుకి కూడా ఎంతో ఇష్టమని చెబుతుంటారు. చాలా కాలం పాటు ఆ పోస్టర్ వారి ఇళ్లలో ఫ్రేమ్ కట్టించి ఉండేదని అంటారు. చివరివరకూ వారి మధ్య స్నేహం కొనసాగుతూనే రావడం విశేషం.