DK Aruna: కేసీఆర్ కుమార్తెను పార్టీ మారాలని బీజేపీ ఆహ్వానించింది అనడం చిల్లర రాజకీయాలకు పరాకాష్ఠ: డీకే అరుణ
- తన కుమార్తెను పార్టీ మారాలని కోరారని కేసీఆర్ ఆరోపణ
- టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో బీజేపీపై వ్యాఖ్యలు
- కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన డీకే అరుణ
- అవినీతిపరుల కుటుంబం నుంచి ఎవరినీ తీసుకోబోమని వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత డీకే అరుణ స్పందించారు. కేసీఆర్ కుమార్తెను పార్టీ మారాలని బీజేపీ ఆహ్వానించిందని ఆరోపణలు చేయడం చిల్లర రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు.
అవినీతిపరులైన కేసీఆర్ కుటుంబం నుంచి ఏ ఒక్కరినీ బీజేపీలో చేర్చుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మీలాంటి అవినీతిపరులకు రెడ్ కార్పెట్ వేస్తామని అనుకుంటున్నారా? అంటూ కేసీఆర్ పై వ్యంగ్యం ప్రదర్శించారు. ఇలాంటి మాటలు చెప్పడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అన్నారు.
బీజేపీ మీద యుద్ధం ప్రకటించానని కేసీఆర్ అంటున్నారు... కానీ బీజేపీ ఎప్పుడో యుద్ధానికి సిద్ధమైందని స్పష్టం చేశారు. రెండుసార్లు ఎన్నికల్లో గెలిపించినా కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారని, మూడోసారి కూడా ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని డీకే అరుణ విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. మొన్నటికి మొన్న మునుగోడులో బీజేపీ ముచ్చెమటలు పట్టించిందని, తెలంగాణ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.