G20: ఐఎంఎఫ్ లేడీ బాసులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ
- జీ20 సదస్సు కోసం బాలి వెళ్లిన మోదీ
- సదస్సులో ఐఎంఎఫ్ లేడీ బాస్ లు క్రిస్టలినా జియార్జియెవా, గీతా గోపినాథ్ లతో భేటీ
- మోదీ ట్వీట్ ను రీట్వీట్ చేసిన గీతా గోపినాథ్
- ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న భారత సంతతి మహిళ గీతా గోపినాథ్
జీ20 సదస్సులో పాలుపంచుకునే నిమిత్తం ఇండోనేషియా రాజధాని బాలి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... సదస్సులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సదస్సులో తొలి రోజు సమావేశాల్లో భాగంగా పలు దేశాధినేతలతో సరదాగా గడిపిన మోదీ... అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు చెందిన మహిళా అధిపతులు క్రిస్టలినా జియార్జియెవా, గీతా గోపినాథ్ లతో భేటీ అయ్యారు.
ఐఎంఎఫ్ కు తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మొన్నటిదాకా ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా వ్యవహరించిన గీతా గోపినాథ్... ఇటీవలే ఆ సంస్థకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. జీ20 సదస్సులో మోదీ వద్దకు వచ్చిన గీతా, క్రిస్టలినా ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ..వారితో కలిసి తాను మాట్లాడుతున్న ఫొటోను ట్వీట్ చేయగా... మోదీ ట్వీట్ ను రీట్వీట్ చేసిన గోపినాథ్.. మోదీతో అర్థవంతమైన చర్చలు జరిపామంటూ తెలిపారు.