Nara Lokesh: కేసులు మాఫీ చెయ్యండి సార్ అంటూ ప్రధానిని వేడుకోవడం తప్ప రాష్ట్రానికి జగన్ చేసిందేమీలేదు: లోకేశ్
- ఉండవల్లిలో టీడీపీ బాదుడే బాదుడు
- పాల్గొన్న నారా లోకేశ్
- గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు
- ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న వైనం
- వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. తాజాగా ఉండవల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్తల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను నారా లోకేశ్ తో చెప్పుకున్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కట్ చేశారని, ఏడాది నుండి పెన్షన్ రావడం లేదంటూ వృద్ధురాలు హైమావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ భూముల్లో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే మోసం చేసారని, కనీసం ఇప్పుడు మమ్మల్ని పలకరించడానికి కూడా రావడం లేదంటూ స్థానికులు బాధ వ్యక్తం చేశారు.
అటవీ భూముల్లో ఉన్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని అన్నారని, మూడున్నర ఏళ్ళు అయినా హామీ నెరవేర్చలేదని ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, చెత్త పన్ను కట్టాలని వేధిస్తున్నారని వెల్లడించారు. దేవుడి మాన్యం ప్రాంతంలో నివసిస్తున్న వారికి అనేక సమస్యలు ఉన్నా అధికారులు కనీసం తమ వైపు చూడటం లేదంటూ వాపోయారు.
ప్రజల సమస్యలు విన్న నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. సార్... సార్... సార్... కేసులు మాఫీ చెయ్యండి... అంటూ ప్రధానిని వేడుకోవడం తప్ప రాష్ట్రం కోసం జగన్ రెడ్డి సాధించింది ఏమి లేదని విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కేని రెండుసార్లు గెలిపిస్తే అభివృద్దిని గాలికొదిలేశారని, అవినీతికి పాల్పడడంలోనూ, నటనలోనూ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గెలిచిన వెంటనే ఇళ్ళ పట్టాలు ఇస్తానన్న ఎమ్మెల్యే ఆర్కే వందల సంఖ్యలో పేద ప్రజల ఇళ్లు కూల్చారని మండిపడ్డారు.
40 ఏళ్లుగా ఇరిగేషన్, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి గెలిచిన ఏడాదిలో బట్టలు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. దేవుడి మాన్యం ప్రాంతంలో 48 గంటల్లోనే రోడ్డు వేయించి జంగిల్ క్లియరెన్స్ చేయిస్తానని స్పష్టం చేశారు.
గతంలో స్థలం కేటాయించినా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయామని, ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తామని వెల్లడించారు. మౌలిక సదుపాయాలు అన్నీ పక్కాగా ఏర్పాటు చేసే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను గెలిచిన తర్వాత పేదలకు మంగళగిరి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు నిర్మిస్తానని లోకేశ్ ఈ సందర్భంగా మాటిచ్చారు.