Gujarat: గుజరాత్ లో తమ అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసిందంటూ కేజ్రీవాల్ ఆరోపణ
- గుజరాత్ ఎన్నికల్లో సూరత్ తూర్పు అభ్యర్థి కనిపించడం లేదని ట్వీట్
- నామినేషన్ ఉపసంహరించుకోవాలని బీజేపీ ఒత్తిడి చేసిందన్న ఢిల్లీ సీఎం
- వచ్చే నెల రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీకి పోలింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని ట్వీట్ చేశారు. నామినేషన్ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
‘సూరత్ (తూర్పు) నియోజవర్గ మా అభ్యర్థి కంచన్ జరివాలా, ఆయన కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. మొదట, ఆయన నామినేషన్ తిరస్కరించడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ నామినేషన్ ను ఆమోదం లభించింది. తరువాత, తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని కంచన్ పై ఒత్తిడి వచ్చింది. ఇప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేశారా?’ అని కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇది ప్రజాస్వామ్య హత్య. సూరత్ ఈస్ట్ స్థానం నుంచి మా అభ్యర్థి కంచన్ జరీవాలాను బీజేపీ కిడ్నాప్ చేసింది. మొదట, ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆపై అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని బలవంతం చేసింది. ఇప్పుడు ఆయన్ని కిడ్నాప్ చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన కనిపించడం లేదు’ అని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 1, 3వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.