Ayyappa Temple: నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప దేవాలయం
- కొనసాగుతున్న అయ్యప్ప స్వాముల సీజన్
- 41 రోజుల పాటు మండల దీక్షలు
- నవంబరు 17 నుంచి మండల దీక్షల భక్తులకు దర్శనాలు
- డిసెంబరు 27న ముగింపు
- జనవరి 14 వరకు మకరవిళక్కు భక్తులకు దర్శనాలు
కేరళలోని పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత నేడు తెరుచుకోనుంది. ఇక్కడి ధర్మ శస్త ఆలయాన్ని మండల పూజ కోసం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తెరవనున్నారు. ఆలయ తంత్రి కందరారు రాజీవరు సమక్షంలో ప్రధాన పూజారి ఎన్.పరమేశ్వరన్ నంబూద్రి గర్భగుడి తలుపులు తెరవనున్నారు. కొన్ని పూజాదికాలు, ఆచార సంప్రదాయాల అనంతరం భక్తులను కూడా నేటి నుంచి అనుమతించనున్నారు.
కాగా, వార్షిక మండలం-మకరవిళక్కు పవిత్ర యాత్ర నవంబరు 17 నుంచి షురూ అవుతుంది. 41 రోజుల పాటు కొనసాగే మండల దీక్ష డిసెంబరు 27న ముగియనుంది. అనంతరం, డిసెంబరు 30న అయ్యప్ప ఆలయం తిరిగి తెరుచుకోనుంది. అక్కడ్నించి జనవరి 14 వరకు మకరవిళక్కు దీక్షలు చేపట్టిన భక్తుల యాత్ర కొనసాగుతుంది. జనవరి 20న ఆలయం మూసివేస్తారు. దాంతో అయ్యప్ప భక్తుల సీజన్ ముగుస్తుంది.
కాగా, స్వామివారి దర్శనాల కోసం భక్తులు ఆన్ లైన్ సేవలు వినియోగించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానం సూచించింది. sabarimalaonline.org వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ ఆన్ లైన్ లో దర్శనం బుక్ చేసుకోలేకపోయిన వారు ప్రత్యేక కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. నీలక్కల్ ప్రాంతంలో కేవలం ఈ దర్శనాల బుకింగ్ కోసమే 10 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
దర్శనాల బుకింగ్ కు ఫీజులేమీ ఉండవు. ఈ దర్శనం టికెట్లను పంబ వద్ద ఉన్న ఆంజనేయ ఆడిటోరియంలో పోలీసుల తనిఖీ చేస్తారు. ఇక, ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులకు బుకింగ్ అవసరంలేదు.