Andhra Pradesh: పోలవరంపై ఉమ్మడి అధ్యయనం ఏదీ ఉండదు: ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి
- హైదరాబాద్ లో ముగిసిన పీపీఏ సమావేశం
- రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరు
- ఉమ్మడి అధ్యయనంపై స్పష్టత ఇచ్చిన ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి
- ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదన్న శశిభూషణ్ కుమార్
- 2023 డిసెంబర్ నాటికి ప్రధాన డ్యాం గ్యాప్ పనులను పూర్తి చేస్తామని వెల్లడి
పోలవరం ప్రాజెక్టులపై ప్రాజెక్టు అథారిటీ కమిటీ (పీపీఏ) సమావేశం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి పీపీఏ అధికారులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
బుధవారం ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై ఉమ్మడి అధ్యయనానికి పీపీఏ నిర్ణయించిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు. అసలు ప్రాజెక్టుపై ఉమ్మడి అధ్యయనమేమీ ఉండబోదని కూడా ఆయన స్పష్టం చేశారు.
2023 జూన్ నాటికి ప్రధాన డ్యాం పనులను గ్రౌండ్ లెవల్ కు తీసుకువస్తామని చెప్పిన ఆయన... ప్రధాన డ్యాం గ్యాప్ పనులను 2023 డిసెంబర్ కు పూర్తి చేస్తామని తెలిపారు. అయినా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నింటినీ అధ్యయనం చేశాకే అనుమతులు ఇచ్చారని ఆయన తెలిపారు.
పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరుతున్నారని, నగరంలో ఈ కార్యాలయానికి తగిన భవనాన్ని వెతుకున్నామని ఆయన తెలిపారు.