Arshdeep Singh: అర్షదీప్ ను అక్రమ్ తో పోల్చవద్దంటున్న దక్షిణాప్రికా ఫీల్డింగ్ దిగ్గజం
- ఇటీవల విశేషంగా రాణిస్తున్న అర్షదీప్
- టీమిండియాలో నిలకడగా అవకాశాలు
- ఇటీవల టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడిన పంజాబ్ పేసర్
- అక్రమ్ తో పోల్చుతున్న క్రికెట్ పండితులు
ఇటీవల భారత పరిమిత ఓవర్ల జట్టులో క్రమం తప్పకుండా స్థానం దక్కించుకుంటున్న ఆటగాడు అర్షదీప్ సింగ్. 23 ఏళ్ల ఈ యువ పంజాబీ పేసర్ తన స్వింగ్ తో బ్యాట్స్ మెన్ ను బోల్తాకొట్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
అయితే, ఎడమచేతివాటం అర్షదీప్ సింగ్ ను పలువురు పాక్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ తో పోల్చుతున్నారు. దీనిపై దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ లెజెండ్ జాంటీ రోడ్స్ స్పందించాడు. అర్షదీప్ ను అక్రమ్ తో పోల్చవద్దని సూచించాడు. అర్షదీప్ కెరీర్ ఇప్పుడే ఆరంభమవుతోందని, ఈ దశలో అక్రమ్ వంటి మేటి బౌలర్ తో పోల్చడం వల్ల అతడిపై ఒత్తిడి పెరుగుతుందని రోడ్స్ అభిప్రాయపడ్డాడు.
అర్షదీప్ గత రెండేళ్లలో ఎంతో మెరుగయ్యాడని, భారత్ లో పేస్ బౌలర్లు తయారవుతున్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బుమ్రా ఎంతో వేగంగా ఎదిగాడని, అర్షదీప్ కూడా ఈ కోవలోకే వస్తాడని తెలిపాడు. అర్షదీప్ బౌలింగ్ లో స్వింగ్ ఉంటుందని, చివరి ఓవర్లలో సమర్థంగా బౌలింగ్ చేయగలడని రోడ్స్ కొనియాడాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో అతడి బౌలింగ్ ఎంతో ప్రభావవంతంగా ఉందని తెలిపాడు.