callers Nme: త్వరలో ఫోన్ స్క్రీన్ పై మనకు కాల్ చేసే వారి పేరు!
- ఇందుకు సంబంధించి సంప్రదింపులు చేపట్టిన ట్రాయ్
- ఇది ముగిసిన తర్వాత టెలికం శాఖకు సిఫారసులు
- ఆపరేటర్ వద్ద రిజిస్టర్ అయిన కస్టమర్ పేరు కనిపించే ఏర్పాటు
కొత్త నంబర్ నుంచి మన ఫోన్ కు కాల్ వస్తుంటే.. లిఫ్ట్ చేద్దామా? వద్దా? అన్న సంశయం ఏర్పడుతుంది. అది మనకు తెలిసిన వారు కావచ్చు. లేదంటే మోసగాళ్లు కావచ్చు. లేదంటే మార్కెటింగ్ కాల్ కావచ్చు. అసలు ఏదైనా నంబర్ నుంచి కాల్ వస్తుంటే, స్వీకరించే ఫోన్ స్క్రీన్ పై పేరు వస్తే బావుంటుంది కదా? త్వరలో ఇది సాకారం అయ్యే అవకాశాలున్నాయి. ఈ విధానంలో టెలికం ఆపరేటర్ వద్ద రిజిస్టర్ అయిన కస్టమర్ పేరు మాత్రమే ఫోన్ స్క్రీన్ పై కనిపించనుంది.
ఒకవేళ ఒకరి సిమ్ కార్డ్ ను వేరొకరు వాడుతున్నట్టయితే, అప్పుడు రిజిస్టర్డ్ కస్టమర్ పేరే కనిపిస్తుంది. దీంతో మన ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేసి లేకపోయినా కానీ, కొత్త నంబర్ నుంచి కాల్ వస్తుంటే, చేసే వారు ఎవరో తెలుసుకునే వీలు కలగనుంది. ఇందుకు వీలుగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ త్వరలోనే చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం ట్రూకాలర్ వంటి సంస్థలు కాలర్ ఎవరో తెలుసుకునే సేవను ఉచితంగానే అందిస్తున్నాయి.
కాకపోతే ట్రూ కాలర్ లో కనిపించే పేర్లు నూరు శాతం నిజమైనవి కావు. తన వద్దనున్న డేటా ఆధారంగా పేరును చూపిస్తుంటుంది. కనుక దీనికి మెరుగైన పరిష్కారం టెలికం సంస్థల నుంచి కాలర్ పేరు కనిపించే ఏర్పాటు చేయడమే అని చెప్పుకోవాలి. కాల్ చేసే వ్యక్తి సమ్మతి లేకుండా, అతడి పేరును స్వీకరించే వ్యక్తికి వెల్లడించడం గోప్యతకు భంగం అంటూ అభ్యంతరాలు ట్రాయ్ ముందుకు వచ్చాయి. కానీ, వీటిని ట్రాయ్ తోసిపుచ్చింది. సంప్రదింపుల ప్రక్రియ ముగిసిన తర్వాత దీనిపై టెలికం శాఖకు ట్రాయ్ తన సిఫారసులు అందించనుంది.