Bandi Sanjay: మా వాళ్లు రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరు: టీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ వార్నింగ్
- బీజేపీ నేత అర్వింద్ నివాసంపై దాడులు
- టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఆగ్రహం
- తాము సంయమనం పాటిస్తున్నామని వెల్లడి
- చేతకానితనం అనుకోవద్దని స్పష్టీకరణ
- కవితపై కేసు నమోదు చేయాలన్న డీకే అరుణ
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తాము ఎంతో సంయమనం పాటిస్తున్నామని, తమ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగితే తట్టుకోలేరని టీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.
అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పలేని దద్దమ్మలు ఇలాంటి దాడులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రయత్నిస్తున్నారని, భౌతిక దాడులతో రౌడీయిజం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ గూండాలకు ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ రోజులు సమీపించాయని స్పష్టం చేశారు.
అటు, ఈ అంశంపై బీజేపీ మహిళా నేత డీకే అరుణ కూడా స్పందించారు. ఎంపీ అర్వింద్ కుటుంబానికి టీఆర్ఎస్ నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. ఎంపీ అర్వింద్ ఇంట్లో లేరని తెలిసి కూడా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ దాడికి కారణమైన ఎమ్మెల్సీ కవితపై కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ఓ ధర్నా చేస్తేనే కేసులు నమోదు చేసే పోలీసులు, ఇప్పుడు కేసులు నమోదు చేస్తారా? అంటూ ప్రశ్నించారు.